మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలపై పులివెందుల సీఐ శంకరయ్యను సస్పెండ్ చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్ తెలిపారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. ‘మాజీ మంత్రి వివేకా హత్యకు గురైన వెంటనే ఆ సమాచారం అందడంతో సీఐ శంకరయ్య సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ సాక్ష్యాలను తారుమారు చేసినా ఆయన అడ్డుకోలేదు. హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి తరలించారు. తలకున్న గాయాలకు కుట్లు వేసి, బ్యాండేజీ వేశారు. ఈ విషయంలో నిందితులకు సహకరించారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సీఐని సస్పెండ్ చేశాం. తదుపరి విచారణ ముమ్మరంగా సాగిస్తున్నాం’ అని డీఐజీ చెప్పారు.
ఇది ఇలా ఉంటే, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై స్పందించి, సమీక్ష నిర్వహించే అధికారం సీఎం చంద్రబాబుకి ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి తనను కలిసి, సిట్ దర్యాప్తులో రాజకీయ జోక్యం ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. సిట్ విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని అన్నారని తెలిపారు. సీఎం చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని సునీత చెప్పారన్నారు.
అయితే వివేకా హత్యపై టీడీపీ, వైసీపీ ఇరువైపుల నుంచి ఆరోపణలు వస్తున్నాయన్నారు. సునీతా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం అడగాలా? కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలా? అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని, ఎన్నికల సంఘానికి ఆ అధికారం లేదని ద్వివేది చెప్పారు. కాగా, వివేకా కుమార్తె సునీత గురువారం అమరావతిలో సీఈవో ద్వివేదిని కలిశారు. బుధవారం విలేకరులకు ఏం చెప్పానో అవే అంశాలను ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు రూపంలో ఇచ్చామని ఆమె అన్నారు.