ఏ పార్టీలో వున్నా చిన్నమ్మగా పిలవబడే మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే బీజేపీలో మాత్రం ఏ వర్గం ముద్ద పడకుండా ఇన్నాళ్లు నెగ్గుకొచ్చారు. కానీ ఏపీ బీజేపీ దేశంలోనే విచిత్రమైన స్ట్రాటజీ. బీజేపీకి రాష్ట్రంలో ఒక వార్డు మెంబర్ కూడా లేరు. కేంద్రంలో అధికారమే బలంగా ఇక్కడ రాజకీయాలు చేస్తుంటారు. ఎన్నికల్లో గెలిచిన ఒక్క పదవీ లేకపోయినా, వర్గాలు మాత్రం బోలెడు. బీజేపీ ఎమ్మెల్సీలు గెలిచినా, అవి అప్పుడు అధికారంలో వున్న టిడిపి భిక్ష. ఇప్పుడు వైసీపీ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఏపీ కీలక నేతలు..ఇతర పార్టీల నుంచి వచ్చిన, ఇతర పార్టీల వైపు చూస్తున్నా, ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్న నేతలని పొమ్మనకుండా పొగబెట్టేస్తున్నారు. బీజేపీ తేనె పూసిన కత్తి రాజకీయాలు తట్టుకోలేక మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్లో చేరగా, తాజాగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీలో ఆ ఇద్దరి నేతల టార్గెట్ పురందేశ్వరిని బయటకి పంపడం అని ప్రచారం సాగుతోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్ని పథకాలకు వైఎస్ఆర్, ఎన్టీఆర్ పేర్లే పెడుతున్నారని, పథకాలకు పెట్టేందుకు ఆ ఇద్దరి పేర్లే ఉన్నాయా? ఇంకా ఎవరూ లేరా? అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్, వైఎస్ పేర్ల గురించి జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి స్పందించారు. ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు అంటూ జీవీఎల్ కి కౌంటర్ ఇచ్చారు. ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరోకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారని ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇదంతా బీజేపీ గేమ్ లో భాగమని కన్నా లక్ష్మీనారాయణ లాగే పురందేశ్వరిని కూడా పొమ్మనకుండా పొగబెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి ఏమైనా డ్యామేజ్ చేసేలా మాట్లాడే బీజేపీ నేతలను సోము వీర్రాజు, జీవీఎల్ టార్గెట్ చేస్తారని బీజేపీలో ఓ వర్గం గుర్రుగా ఉంది.
కన్నాలాగే, పురందేశ్వరికి బీజేపీలో పొగపెట్టారా?
Advertisements