వైసీపీ పార్టీలో ప్రస్తుతం ఎవరైనా అసంతృప్తిగా కనిపిస్తున్నారు అంటే, అది పర్చూరు వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. 151 సీట్లతో, వైసిపీ గెలిచినా, ఈయన మాత్రం పర్చూరులో ఓడిపోయారు. అప్పటి వరకు జగన్ ఎంతో సహకారం అందించారు కూడా. అయితే ఓడిపోయిన తరువాత అందరి వైసీపీ ఇంచార్జ్ లు లాగానే, ఇటు దగ్గుబాటి కూడా, తన నియోజకవర్గంలో పెత్తనం చలాయించటం మొదలు పెట్టారు. మొన్న జరిగిన ట్రాన్స్ఫర్ ల విషయంలో కూడా దగ్గుబాటి తన మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకున్నారు. అయితే, ఏమైందో ఏమో కాని, ఉన్నట్టు ఉండి, మరో నేతను పర్చూరుకి తీసుకువచ్చారు జగన్. దగ్గుబాటి రాకను వ్యతిరేకించి , వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన నాయకుడిని, మళ్ళీ తీసుకొచ్చి, జగన్ చేత కండువా కప్పించారు. అంతే కాక, నియోజకవర్గంలో, ఆయనకే పెత్తనం ఇవ్వాలని, ఆయన చెప్పిన పనులే చెయ్యాలని, పై నుంచి ఆదేశాలు రావటంతో, దగ్గుబాటి డమ్మీ అయ్యారు.
అయితే ఈ విషయం పై జగన్ వద్దే తేల్చుకోవటానికి, దగ్గుబాటి సిద్ధం అయ్యి, జగన్ వద్దకు వచ్చి కలవటానికి ప్రయత్నం చేసారు. అయితే, అటు వైపు నుంచి వచ్చిన రియాక్షన్ చూసి, దగ్గుబాటి అవాక్కయ్యారు. ముందుగా మీరు, జగన్ ని కలవాలి అంటే, మీ భార్య అయిన పురందేశ్వరి కూడా, వైసిపీలోకి రావాలని, వారు ఒక పార్టీ, మీరొక పార్టీ అయితే కుదరదు అని, అప్పుడే జగన్ వద్దకు వచ్చి కలవటం కుదురుతుంది అంటూ, అటు వైపు నుంచి సమాధానం వచ్చింది. దీంతో, దగ్గుబాటి షాక్ అయ్యారు. ఎన్నికల ముందు లేని ఇబ్బంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ, ప్రశ్నించినా, అటు వైపు నుంచి సమాధానం లేదు. దీంతో దగ్గుబాటి అసలు ఏమి చెయ్యాలి అనే విషయం పై నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అందరి వాదనలు విన్న దగ్గుబాటి, వైసీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఇంత వరకు, ఈ విషయం పై అధికారిక ప్రకటన రాలేదు. మరో పక్క పురందేశ్వరి ఈ విషయం పై ఇప్పటి దాక స్పందించలేదు. మొదటి సారి ఆమె, జగన్ పంపించిన ఆఫర్ పై స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పురందేశ్వరి, తను వైసిపీలోకి వస్తేనే, దగ్గుబాటి కూడా ఉంటారు అనే విషయం పై స్పందించారు. ఎన్నికలకు ముందు అయితే తనను వైసీపీలో చేరాలని ఆహ్వానం వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తరువాత తనకు ఎటువంటి ఆహ్వానం రాలేదు. వైసీపీలో చేరడానికి ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, నేను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా ఆ పార్టీ నేతలకు చెప్పారని, అప్పుడు వారు అంగీకరించిన తరువాతే నా భర్త, నా కుమారుడు ఆ పార్టీలో చేరారని పురందేశ్వరి అన్నారు. వైసీపీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయాన్ని వెంకటేశ్వరరావును అడగండి అని పురందేశ్వరి అన్నారు.