తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంత వాసుల భూముల్లో బంగారం పండించడానికి , విశాఖపట్నానికి త్రాగు నీటి ఎద్దడిని ఎదుర్కోడానికి ముందడుగు. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం ఆలస్యం చేసినా, చంద్రబాబు నాయుడు పై తప్పుడు అవినీతి ఆరోపణలు చేసినా ఎన్ని అవరోధాలు కల్పించినా ఈ గోదావరి మహోద్రుత ప్రవాహం కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల వాసుల ప్రయోజనాలు తీర్చడానికి ఉరకులు పరుగులు తీస్తోంది. ఉత్తరాంధ్ర భూములు బంగారమయ్యే రోజులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూ.1638 కోట్లతో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కల సాకారమైంది. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఏలేరు రైతులకు ఇచ్చిన మాట నెరవేరింది. ప్రయోగాత్మక పరిశీలనలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ఆదివారం మధ్యాహ్నం ఏలేరు జలాశయం చెంతకు చేరాయి. తొలి దశలో పురుషోత్తపట్నం పంపు హౌస్ నుంచి గురువారం 1,750 క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ కాలువకు విడుదల చేశారు. జగ్గంపేట మండలంలోని రామవరంలో ఏర్పాటుచేసిన పంపుహౌస్‌కు వచ్చిన ఈ జలాలను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏలేరుకు మోటార్ల ద్వారా మళ్లించారు.
రామవరం నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న ఏలేరుకు గోదావరి జలాలను చేర్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలన చేపట్టారు. ఏలేశ్వరంలో ఏలేరు ఒకటో గ్యాప్ వద్ద నిర్మించిన డిశ్చార్జి ఛానల్‌కి పంపారు. ఈ నిర్మాణంలో రెండు భారీ పైపులను అమర్చి రామవరం పంపుహౌస్‌కి అనుసంధానించారు. ఒక పైపు ద్వారా ప్రస్తుతం 700 క్యూసెక్కుల నీరు ఏలేరు జలాశయంలోకి ప్రవేశిస్తోంది. రెండో పైపు ద్వారా మరో 700 క్యూసెక్కుల జలాలను విడుదల చేసేందుకు రామవరంలో ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు పర్యవేక్షణలో భాగంగా నిర్వహించిన ప్రయోగాత్మక పరిశీలన పూర్తి స్థాయిలో విజయవంతమైందని పోలవరం ఎడమ ప్రధాన కాలువ కార్యనిర్వాహక ఇంజినీర్ రాజేంద్రప్రసాద్ చెప్పారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారికంగా నీటి విడుదల కార్యక్రమం త్వరలో జరుగుతుందని ఈఈ తెలిపారు.
గత ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి జాతికి అంకితంచేశారు. గత ఏడాది అక్టోబర్ నాటికి తొలి దశ పనులు పూర్తిచేసి పుష్కర కాలువ ద్వారా ఏలేరు జలాశయంలోకి 1.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గోదావరి వరదల సమయంలో 10 పంపుల ద్వారా రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తోడి ఏలేరు జలాశయానికి సరఫరా చేస్తారు. ఏలేరు జలాశయంలో 24టీఎంస;ల ఎంసిల నీరు నిల్వచేస్తారు. ఏలేరు జలాశయం పరిధిలో 67,614 ఎకరాల ఆయకట్టుతో పాటు మరో 87వేల ఎకరాలకు ఖరీఫ్‌లో సాగునీరు అందించనున్నారు. రబీలో అపరాల సాగుకు నీరిందించేలా డిజైన్ చేశారు. గోదావరి వరదల సమయంలో ఏలేరు నిండిన తర్వాత అక్కడ నుంచి విశాఖ పారిశ్రామిక అవసరాలకు, నగర ప్రజలకు తాగునీటి అవసరాలకు గోదావరి నీటిని అందిస్తారు. గోదావరి జిల్లాల్లో అతి పెద్ద రిజర్వాయర్‌గా ఏలేరు రిజర్వాయర్ అవతరించనుంది. 24 టీఎంసీల నీటిని వరదల సమయంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నింపుకుంటే ఎపుడు అవసరం వస్తే అపుడు వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ప్రధానంగా పోలవరం పూర్తయ్యేలోగా విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం కూడా కలగనుంది.