ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక క్రమ పద్ధతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు.. ఒక పక్క అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, మరో పక్క అన్ని ప్రధాన రోడ్లతో కనెక్టివిటీ మెరుగుపరిచి, ఎయిర్ ట్రాఫిక్ పై కూడా ద్రుష్టి సారించారు.. రాష్ట్ర విభజన ముందే విశాఖ ఎయిర్ పోర్ట్ ఒక్కటే ఆక్టివ్ గా ఉండేది... తరువాత గన్నవరం, తిరుపతి, రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లను డెవలప్ చెయ్యటంతో, విపరీతంగా కనెక్టివిటీ పెరిగింది.. తాజాగా కర్నూల్ ఎయిర్ పోర్ట్ రెడీ అవుతుంది.. మరో రెండు మూడు నెలల్లో, ఇది అందుబాటులోకి రానుంది. కడప ఎయిర్ పోర్ట్ కూడా రెడీ అయ్యింది. మరో పక్క, ఇప్పటికే అనంతపురంలో పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ ఉంది. అయితే, ఈ ఎయిర్ పోర్ట్ కేవలం వీవీఐపీలకు మాత్రమే ఉపయోగపడుతుంది.. దీంతో చంద్రబాబు, ఈ ఎయిర్ పోర్ట్ ని కూడా ప్రజలకు ఉపయోగపడేలా చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఇక్కడి నుంచి నిత్యం విమానాల రాకపోకలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వివిధ నగరాలకు సర్వీసులు నడిపేలా ఆయా సంస్థలతో చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా జిల్లాకు కియా పరిశ్రమ రాకతో విమాన సర్వీసుల అవసరం పెరిగింది. ఈక్రమంలో పుట్టపర్తి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ యోచిస్తోంది. అనంతపురం జిల్లావాసులకు విమాన ప్రయాణ యోగం కలగనుంది. అనంతపురం జిల్లా వాసులు విమాన ప్రయాణం చేయాలంటే 200 కి.మీ. దూరంలోని బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లాల్సిందే. బెంగళూరు నుంచి నిత్యం విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాలవైపు వెళ్లే విమానాలు రద్దీగానే ఉంటాయి. అప్పటికప్పుడు టిక్కెట్లు దొరకవు. అత్యవసరమైతే అధిక ధరలకు టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
మరోవైపు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల్లో వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కొందరు కడప విమానాశ్రయానికి వెళుతున్నారు. ఇకపై ఈ కష్టాలు ఉండకుండా జిల్లాలోనే పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు నడిపేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో ప్రభుత్వం పుట్టపర్తి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నైలకు విమానాలు నడపాలని భావిస్తున్నారు. అలాగే తిరుపతికి కూడా సర్వీసులు నడపనున్నారు. జిల్లా నుంచి రాకపోకలు సాగించేవారికి, పారిశ్రామికవేత్తలకు, పుట్టపర్తికి వచ్చే భక్తులకు ఊరట కలగనుంది. ప్రస్తుతం ప్రభుత్వం పలు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.