వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చివరి అంకానికి చేరుకుంది. రేపటితో(జనవరి 09) ప్రజా సంకల్ప యాత్ర ముగియనుంది. ముగింపును గ్రాండ్గా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది. దాదాపు సంవత్సరం నుంచి జగన్ కాలినడకన రాష్ట్రాన్ని చుట్టేశారు. పాదయాత్ర పార్టీకి మైలేజ్ తీసుకొస్తుందని వైసీపీ భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాదే ఎన్నికల సమరం. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీలో నెలకొన్న అంతర్గత కుమ్మలాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.
విజయవాడలో వైసీపీకి బలమైన నేతగా ఉన్న వంగవీటి రాధా అలకపాన్పు ఎక్కారు. ఓ వైపు వైసీపీ కేడర్ అంతా ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభకు సిద్ధపడుతుండగా వంగవీటి రాధా నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఆయన ఇచ్ఛాపురం వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆయన గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్న విభేదాలే కారణమని ఆయన సన్నిహితులంటున్నారు.
మరోవైపు పాదయాత్ర ముగింపు సభకు కేవలం సమన్వయకర్తలను మాత్రమే ఆహ్వానించారని తనను ఆహ్వానించలేదని అందుకే దూరంగా ఉంటున్నట్లు రాధా చెబుతున్నారు..! వంగవీటి రాధా గత కొంత కాలంగా, వైసీపీ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగుతున్నారు. ఒకానొక సందర్భంలో తాను పార్టీ మారుతునట్టు వార్తలు కూడా వచ్చాయి. మరో పక్క గౌతం రెడ్డితో, జగన్ ఆడించిన గేమ్, ఇప్పటికీ రాధాను, తన వర్గాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. గౌతం రెడ్డి అన్ని మాటలు అన్నా, సస్పెన్షన్ ఎత్తిసి మరీ, జగన్ మళ్ళీ తన పక్కన చేర్చుకోవటంతో, రాధా అవమానం అయినా, భరిస్తూ వచ్చారు. ఇప్పుడు పార్టీలో ఇంత ముఖ్యమైన సభ జరుగుతూ ఉన్నా, రాధాకి ఆహ్వానం రాలేదు అంటే, ఇక జగన్, రాధాని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే...