విజయవాడ నేత వంగవీటి రంగా గత కొంత కాలంగా, వైసీపీ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగుతున్నారు. ఒకానొక సందర్భంలో తాను పార్టీ మారుతునట్టు వార్తలు కూడా వచ్చాయి. మరో పక్క గౌతం రెడ్డితో, జగన్ ఆడించిన గేమ్, ఇప్పటికీ రాధాను, తన వర్గాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. గౌతం రెడ్డి అన్ని మాటలు అన్నా, సస్పెన్షన్ ఎత్తిసి మరీ, జగన్ మళ్ళీ తన పక్కన చేర్చుకోవటంతో, రాధా అవమానం అయినా, భరిస్తూ వచ్చారు. మొన్న విజయవాడలో జగన్ పాదయాత్ర సందర్భంగా, భారీ జనసమీకరణ కూడా చేసారు రాధా. తరువాత విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వటం కుదరదు అని చావు కబురు చల్లగా చెప్పాడు జగన్.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును వంగవీటి రాధాకు కేటాయించకుండా.. మల్లాది విష్ణుకు కేటాయించటంతో, రాధా అసంతృప్తికి లోనయ్యారు. అయితే, ఎటూ తేల్చుకోని రాధా, కొన్నాళ్ళుగా సైలెంట్ అయిపోయారు. ఇప్పడు తాజగా మరోసారి రాధా తానేంటో జగన్ కు చూపిస్తా అని చెప్పినట్టు తెలుస్తుంది. రాధా బలప్రదర్శన యోచనలో ఉన్నారని తెలుస్తోంది... డిసెంబర్ 26వ తేదీన వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా 'రంగానాడు' పేరిట భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ. గుంటూరు జిల్లా కాజా దగ్గర హైవేపై ఉన్న ప్రాంగణంలో సభ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
చైతన్య కలయిక, రాధా రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటు దక్కక పోవటంతో అలకబూనిన ఆయన... బల ప్రదర్శన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సన్నిహితులతో సమావేశమైన దీనిపై చర్చించిన రాధా... ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని రంగా అభిమానులను పిలవటం పై మరోమారు సన్నిహితులతో భేటీ కానున్నారు. రాధాకు సీటివ్వకపోతే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాధా అనుచరులు చెబుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మేం రాధా వెంటే ఉంటామని.. రాధా ఏ పార్టీలో ఉంటే మేం అదే పార్టీలో ఉంటామని రంగా అభిమానులు స్పష్టం చేశారు.