జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ ఆదివారం సాయంత్రం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని.. టికెట్ విషయమై నాలుగు నెలలుగా వేచి చూస్తున్నా ఇంత వరకూ స్పందించలేదని తీవ్ర అసంతృప్తి చేశారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పంపారు. రాధా రాజీనామా లేఖలో జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన రాజకీయంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి తాను పట్టుబడుతున్న విజయవాడ సెంట్రల్ సీటుపై వైకాపా నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. సెంట్రల్ టికెట్ విషయమై హామీ కోసం ఆయన ఏడాదికి పైగా నిరీక్షించారు. అయినా జగన్ వైపు నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు.
లేఖలోని విషయాలు.. అన్ని వర్గాల అభిమానుపాత్రుడు, సామాన్యుడి సంఘటితానికి స్పూర్తి అయిన నా తండ్రి స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారు ప్రజా క్షేత్రంలో సామాన్య ప్రజల సంక్షేమం, పేద ప్రజల సంరక్షణ కోసం అసువులు అర్పించారు. పేద ప్రజల కోసం నిరంతర పోరాటమే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వారి ఆకాంక్ష. ఎవరి దాయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదు నాది. పోరాటమే నా ఊపిరి. అణచివేత విధానానికి, దమనకాండకు వ్యతిరేకంగా సర్వ ప్రజాసంక్షేమం కోసం, న్యాయ సంరక్షణ కోసం, వర్గాలకు అతీతంగా ఉద్యమం కొనసాగిస్తాను.
జగన్ గురించి... "ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న మీ కాంక్ష నెరవేరాలంటే మీ పార్టీలో అందరికీ ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం నాకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను" అని జగన్‌పై రాధాకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా.. రాధా లేఖపై వైఎస్ జగన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీరుపై ‘రాధా రంగ మిత్రమండలి’ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. వంగవీటి రాధాను వదులుకుంటే వైసీపీకే నష్టమని హెచ్చరిస్తున్నారు. ‘మాట తప్పను అన్న జగన్.. రంగా కుటుంబాన్ని మోసం చేశారు’ అని అభిమానులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.