వైసీపీ కీలకనేత, విజయవాడలో గట్టి పట్టున్న నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? అని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాధా స్పష్టం చేశారు. అంత వరకూ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే.. ఈనెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి రాధా టీడీపీలో చేరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు టీడీపీ కీలకనేతలు రాధాతో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రెండ్రోజుల్లో అనుచరులతో మాట్లాడి ఈ నెల 24 లేదా ఆ తర్వాత రాధా పార్టీలో చేరతారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో టికెట్ ఇచ్చే అవకాశం లేక ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీడీపీ ప్రతిపాదించిందని తెలుస్తోంది. అయితే టీడీపీ ప్రతిపాదనతో రాధా సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలు చెబుతాయి. అయితే, నిజంగానే ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారా..? లేకుంటే జనసేన కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా గత కొద్దిరోజులుగా రాధా.. జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఏ పార్టీలో చేరతారనేదానిపై క్లారిటీ రావాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.
వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరితే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ, తెదేపా విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాధా కృష్ణ తెదేపాలో చేరుతారన్న ప్రచారం ఇప్పటి వరకూ తమ దృష్టికి రాలేదన్నారు. సీఎం చంద్రబాబు ఎవరిని పార్టీలోకి తీసుకున్నా.. కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాధాకృష్ణ తెదేపాలో చేరితే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. ఎవరు వచ్చినా తమకు బలమేనని.. చంద్రబాబు ఎవరిని స్వాగతించినా.. తాము కట్టుబడి ఉంటామన్నారు. విజయవాడ టీడీపీలో ఎవరికీ, ఎవరూ చెక్ కాదని.. అందరం కలిసే పని చేస్తామన్నారు. రాధాకు కానీ, టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు అవినాష్‌లకు కానీ.. పాత గొడవలతో సంబంధం లేదన్నారు. రాధా టీడీపీలోకి వస్తే.. అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.