భారత దేశ భద్రతకు అత్యంత కీలకమైన రఫేల్ యుద్ధ విమానాల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు భారత దేశ రఫేల్ ప్రాజెక్ట్ నిర్వహణ బృందం కార్యాలయంలోకి చొరబడినట్లు సమాచారం. దీంతో గూఢచర్యం కోసం ప్రయత్నాలు జరిగి ఉండవచ్చుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత వాయు సేన వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం భారత దేశ రఫేల్ ప్రాజెక్ట్ నిర్వహణ బృందం కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్ శివారు ప్రాంతంలో సెయింట్ క్లౌడ్ అనే చోట ఉంది. అనుమానితులు ఈ కార్యాలయంలో చొరబడినట్లు, అయితే యుద్ధ విమానాల సాంకేతిక సమాచారానికి సంబంధించిన హార్డ్ డిస్క్ కానీ, పత్రాలు కానీ దొంగతనానికి గురికాలేదని తెలుస్తోంది. చొరబడినవారి ఉద్దేశాలేమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది.
గ్రూప్ కెప్టెన్ స్థాయి అధికారి నేతృత్వంలో రఫేల్ ప్రాజెక్టు టీమ్ పని చేస్తోంది. ఈ యుద్ధ విమానాలను నడపటంలో శిక్షణ, విమానాల తయారీ వంటి అంశాలను ఈ బృందం పర్యవేక్షిస్తోంది. ఈ కార్యాలయంలో డబ్బు, విలువైన వస్తువులు ఉండవు. అయినప్పటికీ కొందరు చొరబడినట్లు తెలియడంతో యుద్ధ విమానాల సాంకేతిక సమాచారాన్ని చోరీ చేయడమే లక్ష్యంగా వారు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెంచ్ డసాల్ట్ ఏవియేషన్ కార్యాలయానికి సమీపంలోనే ఈ కార్యాలయం కూడా ఉంది. భారత దేశం 36 యుద్ధ విమానాలను కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.