రాఫెల్ తరహా యుద్ధ విమానాల్ని తయారు చేసుకునే సామర్థ్యం భారత్ కు ఉందని, ఫ్రెంచ్ కంపెనీతో చర్చలు ముగిస్తేనే బాగుండేదని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు నేతృత్వం వహించిన టి.సువర్ణరాజు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఇండియా-ఫ్రాన్స్ మధ్య జరిగిన డీల్ వ్యవహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒప్పందానికి సంబంధించిన పేపర్లను ఈపాటికే పబ్లిక్ డొమెయిన్లో పెట్టి ఉండాల్సిందన్నారు. హిందుస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజు తన అభిప్రాయాలు వెల్లడించారు.
రాఫెల్ యుద్ధ విమానాలను హెచ్ఏఎల్ ఆ ధరలకు తయారు చేసే సామర్థ్యం లేకనే ఈ డీల్ కుదిరి ఉండవచ్చని.. కానీ అంతకన్నా అధిక సామర్థ్యం గల యుద్ధ విమానాలను హెచ్ఏఎల్ తయారు చేయగలదని అభిప్రాయపడ్డారు. 25 టన్నుల ఫోర్త్ జెనరేషన్ సుఖోయ్-30 విమానాలనే తయారు చేసినప్పుడు... రాఫెల్ జెట్స్ ను కచ్చితంగా తయారు చేసేవారమన్నారు. రాఫెల్ పై అధికార, ప్రతిపక్షాల మధ్య రోజురోజుకూ వివాదం రాజుకుంటుండడంతో రాజు కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సువర్ణరాజు ఈ నెల 1నే హెచ్ఏఎల్ బాధ్యతల నుంచి రిటైరయ్యారు.
మరో పక్క, నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ విమర్శలు ఎక్కు పెట్టింది. ఓ ప్రభుత్వ రంగ సంస్థపై దుష్ప్రాచారం చేసిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాఫెల్ విమానాలను హెచ్ఏఎల్ తయారు చేయలేదన్న నిర్మలా సీతారామన్ వాదనను ఖండిస్తూ ఆ సంస్థ మాజీ అధినేత టీఎస్ రాజు అన్న మాటలను రాహుల్ ప్రస్తావించారు. ప్రభుత్వ అవినీతిని రక్షించే బాధ్యత తీసుకున్న నిర్మలా సీతారామన్ మరోసారి అబద్ధం చెప్పినట్లు రుజువైందని ఆమె తక్షణం రాజీనామా చేయాలని ఆయన ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు టీఎస్ రాజు ఇంటర్వ్యూను ట్యాగ్ చేశారు.