రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి మాయమయ్యాయి. ఈ పత్రాలు చోరీకి గురైనట్టు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు బుధవారంనాడు తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో దాఖలైన రివ్యూ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో వాదనలు సందర్భంగా లాయర్ ప్రశాంత్ భూషణ్ ఓ నోట్‌లో ఉన్న వివరాలు చదువుతుండగా వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించిన డాక్యుమెంట్లు రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని, ప్రస్తుత, లేదా మాజీ ఉద్యోగులు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన కోర్టుకు తెలిపారు. ఈ విషయంతో దేశం మొత్తం నివ్వెరపోయింది.
వార్తాపత్రికలో ప్రచురితమైన నోట్స్‌ను, రివ్యూ పిటిషన్‌కు జోడించిన వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకోరాదని అటార్నీ జనరల్ వాదించారు. దేశభద్రతతో ముడిపడిన రక్షణ కొనుగోళ్ల వ్యవహారంపైనే కోర్టు విచారణ జరుపుతోందని ఆయన పేర్కొన్నారు. 'రక్షణ కొనుగోళ్ల వ్యవహారం ఎంత సున్నితమైనదో ఇటీవల ఘటనలు చెబుతున్నాయి. వీటి స్క్రూటినీ వల్ల భవిష్యత్ కొనుగోళ్ల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో దేశాలు వెనుకంజ వేయవచ్చు. కొందరు పార్లమెంటులో, టీవీ ఛానెల్స్‌లోనూ ఆటంకాలు సృష్టిస్తామని, అంతిమంగా కోర్టుకు వెళ్తామని అనే అవకాశాలు కూడా ఉంటాయి' అని రాఫెల్ డీల్ కేసులో రివ్యూ పిటిషన్లకు వ్యతిరేకంగా వేణుగోపాల్ తన వాదన వినిపించారు.
ఫ్రెంచ్ కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకునే విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలు ఆరోపణలకు దిగడంతో రాఫెల్ డీల్ వ్యవహారం చుట్టూ కొద్దికాలంగా వివాదం ముసురుకుంది. ప్రశాంత్ భూషణ్, మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాఫెల్ డీల్‌పై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వారు కోర్టును కోరారు. అయితే, రాఫెల్ డీల్ ఒప్పంద ప్రక్రియను సందేహించడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదంటూ సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఒప్పందాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టి వేసింది. అయితే, తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది.