నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ర్యాఫ్ట్ ఫౌండేషన్(పునాది)ని కాంక్రీటుతో నింపే బృహత్తర కార్యక్రమాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని ఐదు టవర్లుగా నిర్మిస్తుండగా.. వాటిలో రెండో టవర్ పునాదిని కాంక్రీటుతో నింపే ప్రక్రియను ఇపుడు ప్రారంభిస్తారు. మూడున్నర రోజులపాటు ఏకబిగిన ఈ కార్యక్రమం భారీ క్రతువులా కొనసాగనుంది. వందలాది ఇంజినీర్లు, కార్మికులతో పాటు భారీసంఖ్యలో వాహనాలు, యంత్రాల్ని వినియోగించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. మూడో టవర్‌కి 22న, సీఎం కార్యాలయం ఉండే ఐదో టవర్‌కి 24న పునాదుల్లో కాంక్రీటు నింపే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.
కొద్ది రోజుల వ్యవధిలో మిగతా రెండు టవర్లకూ ఆ పనులు పూర్తిచేస్తారు. కీలక ఘట్టాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తిచేసేందుకు సీఆర్‌డీఏ అన్ని సన్నాహాలూ చేస్తోంది. వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనం ఉండే టవర్‌ని 50, మిగతా నాలుగు టవర్లను 40 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు పునాదుల నిర్మాణమే అనేక విశేషాల సమాహారం. ప్రతి టవర్‌కి సుమారు 12వేల ఘ.మీ.ల కాంక్రీటు వేయాల్సి ఉంటుంది. ‘ఎం45’ టెంపరేచర్ కంట్రోల్డ్ కాంక్రీటు వినియోగిస్తారు. ఎం45 కాంక్రీటు బలాన్ని తెలియజేస్తుంది. సాధారణ నిర్మాణాల్లో ఎం30 కాంక్రీటు వినియోగిస్తారు
ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనుల్ని క్రతువులా కొనసాగించాల్సి ఉంటుంది. ఒక్కసారి కాంక్రీటు వేయడం ప్రారంభించాక నిరంతరాయంగా పూర్తిచేయాల్సిందే. సచివాలయ భవనాల ర్యాఫ్ట్ ఫౌండేషన్‌కు ఒక్కో టవర్‌కి 84 గంటల సమయం పడుతుందని భావిస్తున్నారు. ర్యాఫ్ట్ ఫౌండేషన్ అంటే.. నేల స్వభావం, భవన పరిమాణాల దృష్ట్యా ఎలాంటి పునాది వేయాలో నిర్ణయిస్తారు. రాజధానిలో ఇప్పటి వరకు చేసిన నిర్మాణాలకు పైల్ ఫౌండేషన్ విధానం అనుసరించగా, సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేస్తున్నారు. ఈ విధానంలో నేలలో అవసరమైనంత లోతు తవ్వి.. అక్కడి నుంచి భారీ కాంక్రీటు దిమ్మను నిర్మిస్తారు. దానిపై భవన నిర్మాణం జరుగుతుంది. ఆ కాంక్రీటు దిమ్మనే ర్యాఫ్ట్ ఫౌండేషన్‌గా పిలుస్తారు.