దేశ ఆర్థిక వ్యవస్థను పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) 2017లో స్తంభింపజేశాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ప్రస్తుత వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతోందని, దేశ అవసరాలకు ఇది సరిపోదని తెలిపారు. బెర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చతికిలబడిందని రాజన్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చాలా పెద్ద దెబ్బలని చెప్పారు. వీటివల్ల భారతదేశం వెనుకకు వెళ్ళిందన్నారు. 2012 నుంచి 2016 వరకు భారతదేశం రెండు భారీ దెబ్బలను తట్టుకుని, వేగంగా వృద్ధి చెందిందని వివరించారు.
గత ఏడాదిలో భారత ఆర్థిక వృద్ధి తిరోగమన బాట పట్టడానికి పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు నిర్ణయాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. భారత్‌లో మితిమీరిన అధికార కేంద్రీకృతం మరో సమస్య అని రాజన్ అన్నారు. ‘‘ఒకే కేంద్రం నుంచి పాలిచడం భారత్‌కు సరిపోదు. అధికార వికేంద్రీకరణ జరగాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అధికార కేంద్రీకృతం మితిమీరిన స్థాయిలో ఉంది’’. ప్రతీ నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కార్యాలయం కనుసన్నల్లోనే జరుగుతోందని, పీఎంవో అనుమతి లేనిదే ఎవరూ కూడా నిర్ణయం తీసుకునే సాహసం చేయలేకపోతున్నారని రాజన్ అన్నారు. గతనెల 31న సర్దార్ పటేల్ 143 జయంతి సందర్భంగా ప్రధాని మోదీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఆవిష్కరించారు.
గుజరాత్‌లోని నర్మదా నదీ తీరాన నిర్మించిన ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం. దాదాపు రూ.3 వేల కోట్ల వ్యయంతో కేవలం 33 నెలల్లో ఈ విగ్రహాన్ని నిర్మించారు. పీఎంఓ అనుమతులు, చొరవ వల్లే అతి తక్కువ కాలంలో అత్యంత ఎత్తైన విగ్రహ నిర్మాణం సాధ్యమైందని.. మిగతా అన్ని విషయాల్లోనూ ఇది ఎందుకు కన్పించడం లేదని రాజన్ ప్రశ్నించారు. అధికార కేంద్రీకృతానికి తోడు అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అధికారులు వ్యాపారపరమైన నిర్ణయాల్లో చొరవ తీసుకోలేకపోతున్నారని అన్నారు. వరుసగా అవినీతి కుంభకోణాలు వెలుగు చూసినప్పటి నుంచి అధికారులు నిర్ణయాల్లో వెనకడుగు వేస్తున్నారని రాజన్ పేర్కొన్నారు.