ఒక పార్టీకి అనుకూలంగా ఉండే ఒక వెబ్‌సైట్ పై, నర్సాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు సీరియస్ అయ్యారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే కధనం రాసి, తన పై బురద చల్లినందుకు, తగిన చర్యలు తీసుకోవాలి అంటూ, లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు, రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేసారు. గ్రేట్ ఆంధ్ర అనే వెవెబ్‌సైట్, అర్జెంటుగా సస్పెండ్ చేయించుకోవాలని, ఆ ఎంపీ ఉబలాటం అంటూ, తన పై కధనం రాసారని, తన ఫిర్యాదులో తెలిపారు. తన పై అసత్య ప్రచారం చేసిన ఆ కధనం పై, చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ కధనంలో తన పేరు ఎక్కడా రాయకపోయినా, తనను ఉద్దేశించి చేసిన కంటెంట్ అందులో ఉంది, అంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు. తన పై నిందలు వేసిన ఆ వెబ్‌సైట్ పై, సభా హక్కుల ఉల్లంఘన కింద, చర్యలు తీసుకోవాలని, స్పీకర్ ని కోరారు. అలాగే తాను తాగి ఒక సమావేశానికి హాజరు అయ్యానని, అక్కడ జగన్ తనను చూసి, దూరం పెడుతున్నారు అంటూ, ఆ ఆర్టికల్ లో రాసారని, ఇదంతా అవాస్తవం అని, తన ప్రతిష్ట దిగజార్చటానికి, ఆ వెబ్‌సైట్ ఇలా రాసింది అంటూ, రఘురామకృష్ణంరాజు, స్పీకర్ కు రాసిన లేఖలో తెలిపారు. తాను, ఎక్కడా ప్రభుత్వాన్ని, తమ అధినేతను విమర్శించటం లేదని, కేవలం కొన్ని విషయాల పై తన వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పానని అన్నారు.
దీనికి, తన పై ఇష్టం వచ్చినట్టు కధనాలు రాసారని, ఇది ఎంపీగా ఉన్న తన హక్కులు, ప్రతిష్టతకు మచ్చ అని, అందుకే వారి పై సభా హక్కుల ఉల్లంఘన మొదలు పెట్టాలని కోరారు. అయితే, ఇదే విషయం పై రఘురామకృష్ణం రాజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని వెబ్‌సైట్‌లు, ఇతర మాధ్యమాలు తన పై కక్ష కట్టిన వ్యవహరిస్తూ, వ్యతిరేక కధనాలు రాస్తున్నాయి అంటూ, ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న, కొన్ని వెబ్‌సైట్లలోనే తన పై, ఇలా ఉద్దేశపూర్వకంగా ఎందుకు రాస్తున్నారో అర్ధం కావటం లేదని, అన్నీ తాను గమనిస్తున్నాని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి, సోషల్ మీడియా విషయాలు చూసుకునే ఒక వ్యక్తి, ఇలా నన్ను టార్గెట్ చేసుకుని రాతలు రాస్తున్నారని, త్వరలోనే జగన్ ను కలిసి, ఈ విషయాలు పై ఫిర్యాదు చేస్తానని, ఎంపీ, రఘురామకృష్ణంరాజు తెలిపారు. అలాగే, ఆయన ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పై, పార్లమెంట్ స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.