వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు, ఆ పార్టీ నేత, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు పంపించిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసు, పార్టీ అధినేతను కించపరుచుతున్నారు అంటూ, కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ తో విజయసాయి రెడ్డి, రఘు రామ రాజుకు నోటీస్ ఇచ్చారు. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని, లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అంటూ, రఘురామకృష్ణం రాజుకు నోటీసులో తెలిపారు. అయితే దీని పై రఘురామరాజు ఈ రోజే నేను సమాధానం ఇస్తానని, నిన్న మీడియాతో తెలిపిన సంగతి తెలిసిందే. రఘురామ రాజు ఎలా స్పందిస్తారా అని అందరూ అనుకుంటున్న సమయంలో, ఆయన ఈ రోజు ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో షోకాజ్ నోటీసు స్పందన పై, ఆయన వెరైటీగా, లాజికల్ గా, వైసిపీకి షాక్ ఇచ్చే విధంగా స్పందించారు. నేను ఆ షోకాజ్ నోటీస్ కు సమాధానం ఇవ్వాలి అంటే, ముందు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ, మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా, ప్రశ్నలు సంధించారు రఘురామ రాజు.
రఘురామ మాట్లాడుతూ "నేను ఎప్పుడూ మా నాయకుడు ఒక్క మాట అనలేదు. అయినా నాకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. అయితే ఆ షోకాజ్ నోటీసుకు రిప్లై ఇద్దాం అనుకుంటే, నాకు ఇచ్చిన నోటీస్ లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాకు బీఫారం ఇచ్చింది అని రాసారు. అయితే నా బీఫాం కాని, ఎలక్షన్ సర్టిఫికేట్ లో కాని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఉంది. నాకు నోటీస్ ఇచ్చిన లెటర్ హెడ్ లో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంది. నాకు డౌట్ వచ్చి ఎలక్షన్ కమిషన్ వెబ్సైటు లో చూసాను. అక్కడ కూడా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఉంది. మరి నా బీఫారం గురించి చెప్తూ నోటీసు ఇచ్చారు కాబట్టి, పేరులో తేడా ఉంది కాబట్టి, నాకు క్లారిఫికేషన్ కావాలి. నేను వివరణ ఇవ్వాల్సింది, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, అందుకే నేను ఈ ప్రశ్న అడుగుతున్నా, లేకపోతే రేపు నాకు లీగల్ ఇబ్బందులు వస్తాయి. అలాగే, మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం, ఇలాంటి నోటీసులు క్రమశిక్షణ కమిటీ ఇవ్వాలి. మరి జనరల్ సెక్రటరీ ఎందుకు ఇచ్చారు ? నేనే రిప్లై ఇవ్వాల్సింది వైఎస్ఆర్ పార్టీకి కాదు. పార్టీ మారితే నాకు ఆ వివరాలు ఇవ్వండి. స్టేట్ పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీ ఎలా ఉంటారు ? నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వెంటనే, నేను మళ్ళీ షోకాజ్ నోటీస్ కు సమాధానం చెప్తాను" అని రఘు రామ రాజు అన్నారు. మరి, వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.