అసెంబ్లీలో చంద్రబాబు పై వ్యక్తిగత దాడి చేసి, పైకి గంభీరంగా కనిపిస్తున్నా, లోలోపల మాత్రం, వైసీపీ పార్టీలో ఏదో అబధ్రతా భావం కనిపిస్తుంది. ఒక పక్క ఢిల్లీలో తమ పార్టీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు షాకులు మీద షాకులు ఇస్తుంటే, ఇక్కడ ఏపిలో నెల్లూరు పెద్దా రెడ్డి అయిన, ఆనం రాంనారాయణ రెడ్డి, నెల్లూరు మొత్తం మాఫియాలే అంటూ, సొంత ప్రభుత్వం పైనే సంచలన వ్యాఖ్యలు చేసి, సస్పెన్షన్ దాకా వెళ్ళేలా చేసారు. అయితే, ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ మాత్రం, ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులకు ఇస్తున్న విందు. అది కూడా బీజేపీ ఎంపీలను, కేంద్ర మంత్రులను టార్గెట్ చేస్తూ ఇస్తున్న విందు. వైసీపీ ఎంపీ హోదాలో కాకుండా, సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో పార్లమెంట్ సభ్యులకు రఘరామ కృష్ణంరాజు ఈ విందు ఇస్తున్నారు. ఢిల్లీలోని జన్‌పథ్, లాన్స్ ఆఫ్ వెస్టర్న్ కోర్టులోని ఆయన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో, ఈ పొలిటికల్ డిన్నర్ జరగనుంది. అయితే కేవీపీ ఇంట్లో పెట్టటానికి కారణం కూడా చెప్పారు.
తనకు ఇంకా నివాసం కేటాయించక పోవటంతోనే, తన వియ్యంకుడు అయిన కేవీపీ రామచంద్రరావు నివాసంలో, ఈ విందు ఇస్తున్నట్టు రఘరామ కృష్ణంరాజు చెప్పారు. ఈ ఈ కార్యక్రమానికి మొత్తం 300 మంది ఎంపీలు హాజరవుతారని రఘురామకృష్ణంరాజు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ విందుకు వస్తారని ప్రచారం జరుగుతున్నా, వాళ్ళు వచ్చే అవకాసం లేదని, కొంత మంది కేంద్ర మంత్రులు, మాత్రం వస్తారాని చెప్తున్నారు. అయితే ఈ విందుకు సొంత పార్టీ ఎంపీలు వస్తారా ? మరీ ముఖ్యంగా విజయసాయి రెడ్డి హాజరు అవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. జరుగుతున్న పరిణామాలు అన్నీ వైసీపీ అధిష్టానం గమనిస్తుంది.
రఘరామ కృష్ణంరాజు లైన్ దాటి, బీజేపీ దారిలోకి వెళ్తున్నారు అనే అనుమానం రావటంతోనే, దానికి కౌంటర్ గా జగన్ మోహన్ రెడ్డి, పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజును, ఆయన సోదరులు నరసింహరాజు, రామరాజులను వైసీపీలో చేర్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రఘురామకృష్ణంరాజు ఇప్పటికీ జగన్ హెచ్చరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. విజయసాయి రెడ్డి లేకుండా ఎవరినీ కలవద్దు అని చెప్తున్నా, ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రుల్ని కలుస్తుండటంతో జగన్ అసహనానికి లోనవుతున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా విందు ఏర్పాటు చెయ్యటం, అదీ కూడా, వైసీపీ ఎంపీగా కాకుండా, సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో విందు ఇవ్వటం చర్చనీయాసం అయ్యింది.