వైసీపీ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి తిరుగు లేదు అనే భావన ఉంటుంది. ఇది కొంచెం నిజం కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నవి చూస్తూనే అర్ధమవుతుంది. మూడు రాజధానులు అంటూ, జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో, ఎవరూ సంతోషంగా లేరు. అమరావతి రైతులు అయితే, 12 రోజులుగా రోడ్డున పడి ఆందోళన చేస్తున్నారు. చివరకు ఎప్పుడూ లేనిది, ఉద్యమంలోకి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, పిల్లలు కూడా రోడ్డున పడ్డారు. ఇవన్నీ చూస్తుంటేనే, ఉద్యమం ఏ స్థాయిలో ఉందొ అర్ధమవుతుంది. అయితే అనూహ్యంగా, అక్కడ వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం, అడ్డ్రెస్ లేరు. తాడికొండ ఎమ్మెల్యే కాని, మంగళగిరి ఎమ్మేల్యే కాని, కనీసం వారికి మద్దతు పలకలేదు, లేదా జగన్ తో మాట్లాడుతాం అని కూడా చెప్పలేదు. చివరకు కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మేల్యేలు సమావేశం అయ్యి, జగన్ నిర్ణయానికి జై కొట్టారు. వైసీపీలో పరిస్థితి ఇది. అయితే, అనూహ్యంగా ఒక్కరు మాత్రం, జగన్ నిర్ణయాన్ని అసలు లెక్క చెయ్యనట్టు కనిపిస్తారు.
ఆయనే ఎంపీ రఘురామ కృష్ణం రాజు. పార్లమెంట్ లో తెలుగుకు జై కొట్టి జగన్ ను ఇబ్బంది పెట్టటం, విజయసాయి లేకుండా ఎవరినీ ఢిల్లీలో కలవద్దు అని చెప్పినా, పదే పదే అందరినీ కలవటం, పైగా పార్టీకి సంబంధం లేకుండా, ఢిల్లీలో అందరికీ విందు ఇవ్వటం, ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. అదేమని అడిగితె, తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు అంటూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు రఘు రామ కృష్ణం రాజు, మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తూ, దీని పై సిబిఐ కాని, ఇంకా ఏమైనా న్యాయ విచారణ చేస్తామని, నిన్న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని, ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇన్సైడర్ ట్రేడింగ్ పై, సిబిఐ విచారణ అంటూ జగన్ చెప్పటం పై, రఘు రామ కృష్ణం రాజు, ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దానికి చట్ట పరంగా బలం లేదని తేల్చి చెప్పారు. అమరావతి రాజధానిగా వస్తుందని, శంకుస్థాపన చేసిన తరువాత, ఎవరికైనా తెలుస్తుంది, డబ్బు ఉన్న వాడు భూమి కొనుక్కుంటాడు, దాంట్లో తప్పు ఏమి ఉంది. ఇదేమీ న్యాయ పరంగా తప్పు కాదు, కాని నైతికంగా తప్పు అని చెప్పచ్చు. అయినా, ఇదేమి న్యాయం ముందు నిలవదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేదానికి చట్టం అనేది లేదు. ఒకవేళ జగన్ ఏమైనా దీని పై చట్టం తెస్తే తప్పితే, దీని పై జరిగేది ఏమి ఉండదు అంటూ, తేల్చి చెప్పారు. అయితే అమరావతి పై ఒక బూచిగా వైసీపీ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ చెప్తుంటే, సొంత పార్టీ నేత మాత్రం, అసలు అది పస లేని వాదన, దానితో ఏది కాదు అని తేల్చి చెప్పారు.