గత కొంత కాలంగా రాఫెల్ స్కాం బయట పెట్టి, మోడీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి, దాని పై కనీసం మోడీ స్పందించే ధైర్యం కూడా చెయ్యకుండా చేసిన రాహుల్ గాంధీ, ఇప్పుడు మరో కుంభకోణంతో వచ్చారు. ఈ సారి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంతు. మన ఏపి ప్రజలను ఉద్దేశిస్తూ, మీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి, రక్షణ బడ్జెట్ కావాలా అంటూ వెటకారం చేసిన ఈయన, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో ? ఈ స్కాంకు సంబంధించి, వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ నుంచి జైట్లీ కుమార్తె రూ.24 లక్షలు తీసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయాన్ని బయటపెట్టేందుకు మీడియా భయపడుతోందన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన రైతుల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. న్యాయవాదులైన జైట్లీ కుమార్తె సోనాలీ జైట్లీ, అల్లుడు జయేశ్ బక్షి... ఛోక్సీ మోసపూరిత సంస్థ గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ కోసం పని చేశారు. 2017 డిసెంబరులో ఆ సంస్థ వారికి రూ.24 లక్షలు చెల్లించింది. ఛోక్సీ ఫైల్‌ను జైట్లీ తొక్కిపెట్టడంతోనే అతను పారిపోయాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాయ్‌పూర్ సభలోనే కాకుండా రాహుల్ ట్విటర్‌లో కూడా జైట్లీపై ధ్వజమెత్తారు. ఛోక్సీ పేరోల్‌లో సోనాలీ ఉన్నారని, ఐసీఐసీఐ ఖాతా నంబరు 12170500316 నుంచి ఆమెకు డబ్బు అందిందని ఆరోపించారు.
రాహుల్ మాట్లాడుతూ, ‘దేశం నుంచి రూ.35,000 కోట్ల నిధులతో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల గురించి మీరు వినే ఉంటారు. చోక్సీ రూ.24 లక్షలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారు. కానీ ప్రముఖ మీడియా సంస్థలేవీ ఈ విషయాన్ని ప్రసారం చేయడం లేదు. నిజాన్ని బయటపెట్టాల్సిన మీడియా సంస్థలు బెదిరింపులకు, అణచివేతకు గురవుతున్నాయి’ అని తెలిపారు. రఫేల్ ఫైటర్ జెట్ల కాంట్రాక్టు నుంచి ప్రభుత్వ రంగ హాల్ సంస్థను తప్పించిన ప్రధాని మోదీ.. కనీసం కాగితపు విమానాన్ని తయారుచేసిన అనుభవం కూడా లేని రిలయన్స్ సంస్థకు కాంట్రాక్టును అప్పగించారని ఎద్దేవా చేశారు.