ఎన్నికల ప్రచారంలో ఉన్న, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహంతో, ఆయన పాల్గొన్న ఎన్నికల ర్యాలీలో గందరగోళానికి దారి తీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నవంబరు 28న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆయన జబల్పూర్లో ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధినేతకు హారతి ఇవ్వాలని కార్యకర్తలు పలు వరసల్లో ఉన్న హారతి పళ్లేన్ని తీసుకువచ్చారు. అయితే వారి పక్కన ఉన్న, మగిలిన కార్యకర్తల చేతిలో గ్యాస్ నింపిన బెలూన్లున్నాయి.
దాంతో హారతి ఇచ్చే సమయంలో దీపాలు ఒక్కసారిగా బెలూన్లకు అంటుకోవడంతో పెద్ద మంట చెలరేగింది. కాకపోతే అది వెంటనే ఆరిపోవడంతో ఎటువంటి ప్రమాదం లేకుండా అందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో ఓపెన్ టాప్ జీప్‌లో రాహుల్‌తో పాటు, జ్యోతిరాదిత్య సింథియా, కమల్ నాథ్ కూడా ఉన్నారు. మంటలు వెంటనే ఆరినా కొందరు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే ఈ విషయం పై విమర్శలు రావటంతో పోలీసులు స్పందించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలను ఎస్పీ అమిత్ సింగ్ కొట్టిపారేశారు. ‘వారందరూ కాంగ్రెస్ కార్యకర్తలే. నిబంధనల ప్రకారం 15 మీటర్ల దూరాన్ని పాటించాం. ఎటువంటి లాఠీ ఛార్జి జరగలేదు’ అని ఆయన వెల్లడించారు.
రాహుల్ పర్యటనలో ఇలా భద్రతాలోపాలు అనేక మార్లు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక ఎన్నికల సమయంలో ఆయన ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. దాని పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే గత సంవత్సరం గుజరాత్ పర్యటనలో భాగంగా ఆయన మీద కొందరు రాళ్లు విసిరారు. దీని పై పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. దానికి కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ సమాధానమిస్తూ, రాహుల్ గాంధీ అనేక సార్లు భద్రతా ప్రొటోకాల్ సరిగా పాటించలేదన్నారు. రాహుల్ గత రెండు సంవత్సరాల్లో 121 పర్యటనలకు వెళ్లగా వాటిలో దాదాపు 100 పర్యటనలకు బుల్లెట్ ప్రూఫ్ వాడలేదని తెలిపారు.