ఆస్ట్రేలియా గడ్డపై గుంటూరు కుర్రాడు రాగాల వెంకట రాహుల్ తళుక్కున మెరిశాడు..తన అసమాన పోరాటంతో గోల్డ్‌కోస్ట్‌లో స్వర్ణరాగాలు వినిపించాడు... ఆంధ్రోడి సత్తాను విశ్వవేదికపై చాటుతూ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. గాయం ఇబ్బంది పెడుతున్నా.. దృఢ సంకల్పంతో.. చెక్కుచెదరని ఏకాగ్రతతో.. కొండంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన రాహుల్.. తన పట్టుదలతో మెప్పించాడు.. శనివారం జరిగిన పురుషుల 85 కేజీల విభాగం ఫైనల్లో రాహుల్ స్నాచ్‌లో 151 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 187 కిలోలు బరువెత్తాడు. మొత్తంగా 338 కిలోలతో అగ్రస్థానంతో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు... ఈ గెలుపు వెనుక అలుపెరగని సాధన... అందరికీ తెలియని వేదన చూడండి...
రాహుల్‌ది స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్ట్‌పురం గ్రామం. కటిక దరిద్య్రం నుండి... మట్టిలో మాణిక్యంలా... కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించటం వెనుక చాలా శ్రమ దాగి ఉంది.. పిల్లల్ని ఛాంపియన్లుగా చూడాలనుకున్న వీరి తండ్రి మధు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. అప్పుల భారం నుంచి బయటపడేందుకు రెండెకరాల భూమి, పెద్ద ఇంటిని అమ్మేశారు. రాహుల్ ముందు నుంచే అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నా ఆ కుటుంబం పూరి గుడిసెకు మారక తప్పలేదు. ఇంటిని కోల్పోయిన తండ్రిని ఓదారుస్తూ.. క్యాన్సర్ బారిన పడిన తల్లి నీలిమకు ధైర్యం చెప్తూ రాహుల్, వరుణ్, కూతురు మధుప్రియ వెయిట్ లిఫ్టర్లుగా ఎదిగారు. నిరుడు 2016 ఆగస్టులో తల్లి నీలిమ మరణం ఆ కుటుంబంలో పెను విషాదమే.
2009లో రాహుల్ హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఇప్పుడు తెలంగాణ)లో ప్రవేశాలు పొందారు. యూత్ ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో 25 స్వర్ణ, 9 రజత, 4 కాంస్య పతకాలతో రాహుల్ సత్తాచాటాడు. ఆరేళ్ల వ్యవధిలో మరే లిఫ్టర్ కూడా దేశం తరఫున ఇన్ని పతకాలు సాధించలేదు. గతేడాది ఆస్ట్రేలియాలో కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో రాహుల్, వరుణ్‌ల ప్రదర్శన తెలిసిందే. తాజాగా మెన్స్ 85 కేజీల విభాగంలో తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ స్వర్ణ పతకాన్ని గెలిచాడు... అయితే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న రాహుల్ ని, అటు తెలంగాణా ప్రభుత్వం కాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాని గుర్తించలేదు... వరుణ్ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టారని తెలంగాణ అధికారులు.. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నందు వల్ల తెలంగాణకు చెందుతారని ఆంధ్రప్రదేశ్ అధికారులు వాదించుకుంటున్నారు. వాళ్లు చూసుకుంటారు అని వీళ్లు.. వీళ్లు చూసుకుంటారు అని వాళ్లు వదిలేసారు... సరిగ్గా అదే సమయంలో, విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్ళింది... అంతే చంద్రబాబు వెంటనే రాహుల్ ని పిలిపించారు...
క్రికెట్, టెన్నిస్ లాంటి క్రీడాకారులేనా, ప్రభుత్వాలకి వేరే ఆటలు, వాళ్ళ ప్రతిభలు కనపడవా అనే వారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అతీతం... గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబు వారి పరిస్థితి తెలుసుకున్నారు, ప్రతిభ గుర్తించారు... రాహుల్‌కు రూ. 15 లక్షలు ప్రోత్సాహకం ప్రకటించారు. 2.5 ఎకరాల భూమి కూడా ఇచ్చారు... కోచింగ్ కి ఎంత డబ్బులు అయితే అంత ప్రభుత్వం పెట్టుకుంటుంది, నువ్వు ఆట మీద దృష్టి పెట్టి దేశానికి మంచి పేరు తేవాలని చంద్రబాబు ప్రోత్సహించారు... ఆ రుణం తీర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ కి కామన్వెల్త్ పసిడి అందించాడు రాహుల్... అటు తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, తాను పడిన కష్టం ఫలిచింది... ఈ విజయ పరంపర కొనసాగాలని.... ఒలింపిక్ పోటీల్లో నూ పతకం సాధించాలని... జీవితంలో నూ రాహుల్ మంచిగా స్థిరపడాలని ఆశిస్తూ... స్వర్ణం ఎత్తిన ఆంధ్రుదికి జయహో...