లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అవిశ్వాసంపై చర్చలో భాగంగా అప్పటివరకూ మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ప్రసంగం ముగించే ముందు మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ ఎందుకు తన దగ్గరికి వస్తున్నాడో తెలియక, మోడీ అవాక్కయ్యారు. తరువాత తేరుకుని, మోదీ కూడా నవ్వుతూ రాహుల్‌ను పలకరించి.. భుజం తట్టారు. ‘నన్ను పప్పు అనుకున్నా పర్లేదు...దేశం కోసం భరిస్తా. నా మీద మీలో కోపం, ద్వేషం ఉన్నాయి. నేను వాటిని తొలగిస్తా’ అంటూ ప్రధాని మోదీ దగ్గరికి రాహల్ వెళ్లారు. ప్రధాని మోదీకి షేక్‌హ్యాండ్ ఇచ్చి అలింగనం చేసుకున్నారు. ఊహించని రాహుల్ చర్యతో ప్రధాని మోదీ అవాక్కయ్యారు. తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చొన్న రాహుల్ తోటి సభ్యులు ఏదో అడగటంతో కన్ను కొడుతూ కనిపించారు. అయితే మోడీ డ్రామాలను, అదే డ్రామాతో రాహుల్ కౌంటర్ ఇచ్చాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
అంతకు ముందు మాట్లాడిన రాహుల్, మోడీ పై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి అనే పదానికి భారత ప్రజానీకం అర్థం వెతుకుతోంది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15లక్షలు, ఏటా 2కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.2014లో దేశ మొత్తమ్మీద కేవలం 4లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది. ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమంటూ సలహా ఇస్తున్నారు. జీఎస్టీ స్లాబ్ ఒకటే ఉండాలని చెప్పాం... కానీ ఐదు స్లాబ్‌లు పెట్టారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలని కోరినా పట్టించుకోలేదు. ఒకరోజు అర్థరాత్రి ఆకస్మాతుగా పెద్దనోట్లు రద్దు చేశారు. దాని వల్ల ఏం ప్రయోజనం జరిగింది. పెద్దనోట్ల రద్దు వల్ల మధ్య, చిన్న తరగతి పరిశ్రమలు దివాళా తీశాయి. వాటిలో పనిచేస్తున్న ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఒక్కసారిగా దేశం నెత్తిన జీఎస్టీ రుద్దారు. మీరిచ్చిన ఉపాది హామీలన్నీ నీటిమూటలయ్యాయి అన్నారు.
రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ‘యూపీఏ హయాంలో ఒక్కో రాఫెల్ విమానం ఖరీదు రూ.520కోట్లు. ప్రధాని ఫ్రాన్స్ వెళ్లి ఎవరితోనో చర్చలు జరిపారు. ఇప్పడు విమానం ఖరీదు రూ.1,600కోట్లు. ప్రధాని ఎవరితో కలిసి ఫ్రాన్స్ వెళ్లారో చెప్పాలి. నేనే స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలిశాను. ఆయన ఎలాంటి ఒప్పందం జరగలేదని చెప్పారు. రక్షణ మంత్రి అబద్ధాలు చెబుతున్నారు. ఒక వ్యక్తికి రాఫెల్ కాంట్రాక్టు వెళ్లింది. ఆయనకు వేల కోట్ల లాభం చేకూరింది’ అని రాహుల్‌గాంధీ ఆరోపించారు.