కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గంలో పోటీకి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌కు రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. రాహుల్ సమర్పించిన అఫిడవిట్, అనుబంధ పత్రాలు సరిగానే ఉన్నాయని రిటర్నింగ్ అధికారి సోమవారంనాడు ప్రకటించారు. రాహుల్ గాంధీ నామినేషన్‌ను సవాలు చేసిన ఫిర్యాదిదారు ఎలాంటి సాక్ష్యాలను సమర్పించలేదని, ఆయనపై చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోయారని ఆర్ఓ రామ్మనోహర్ మిశ్రా తెలిపారు. రాహుల్ నామినేషన్ పత్రాల్లో పలు అసంబద్ధతలు ఉన్నట్టు ఇంటిపెండెంట్ అభ్యర్థి ధ్రువ్‌లాల్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాహుల్ నామినేషన్ పత్రాల పరిశీలనను మిశ్రా రెండ్రోజుల క్రితం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, రాహుల్ నామినేషన్ పత్రాలపై లేవనెత్తిన అభ్యంతరాలపై ఆయన తరఫు లాయర్ కేసీ కౌషిక్ రిటర్నింగ్ అధికారికి వివరణ ఇచ్చారు.
రాహుల్ ఇండియాలోనే పుట్టారని, ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నారని, ఇతర దేశ పౌరసత్వాన్ని రాహుల్ ఎప్పుడూ తీసుకోలేదని ఆయన తెలియజేశారు. ఆయన పాస్‌పార్ట్, ఓటర్ ఐడీ, ఆదాయం పన్ను, ప్రతీదీ ఇండియాకు చెందినదేనని చెప్పారు. రాహుల్ గాంధీ 1995లో కేంబ్రిడ్జి యూనివర్శఇటీ నుంచి ఎంఫిల్ చేశారని, ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ కాపీని తాను జతచేశానని కౌశిక్ వివరించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందారు. రాహుల్ అఫిడవిట్ చెల్లుతుందంటూ ప్రకటించారు. గాంధీల కుటుంబానికి సంప్రదాయబద్ధంగా విజయాన్నిఅందిస్తున్న అమేథీలో మే 6న పోలింగ్ జరుగనుంది.