తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని, దేశ ప్రధాని మోడీ ఈ దేశ ప్రజలను నిలువెత్తున మోసం చేశాడని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాట తప్పారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. తిరుపతిలో శుక్రవారం సాయంత్రం స్థానిక తారకరామ స్టేడియంలో జరిగిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇదే వేదికనుంచి ప్రధాని మోడీ 2014లో శ్రీవారి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదాపై నిధులపై హామీ ఇచ్చి నేడు మాటతప్పారని విమర్శించారు. ఆయన్ను కేవలం తన సొంత వారికే దోచిపెట్టేందుకే ప్రధానిగా కొనసాగారని, మోడీ తాను ఈ దేశ కాపలాదారునిగా పేర్కొంటారని, కానీ ఆయన కాపలా దారుడు కాదని, ఈ దేశానికి ఓ దొంగలా తయారయ్యారంటూ రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట తప్పారని, రుణమాఫీ విషయంలో వెనకడుగు వేశారని, నిరుద్యోగులకు ప్రతియేటా లక్షలాది ఉద్యోగాలంటూ వారిని నట్టేట ముంచడమేగాక ఉన్నవారి ఉద్యోగాలు కూడా నేడు ఊడుతున్నాయంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. అదేవిధంగా రూ.30 వేల కోట్ల కొనుగోళ్లలో తన అనుచర పారిశ్రామిక వేత్తలైన అంబానీ, ఆదానీలకు అప్పనంగా దోచిపెట్టారంటూ రాహుల్ విమర్శించారు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని పారిశ్రామిక వేత్తల ఎదుట మోడీ తాకట్టు పెట్టారంటూ రాహుల్ విమర్శించారు. ఒక దేశ ప్రధానిగా వుంటూ అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని, మోడీ జీవితంలో నిజాలు పలకడం లేదని రాహుల్ విమర్శించారు. తాము ఇటీవల జరిగిన ఉత్తరాది ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలని పడగొట్టి కాంగ్రెస్ అధికారం చేపట్టిందంటే అందుకు ప్రధాన కారణం బీజేపీపై, మోడీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా వున్నారని, తాను ప్రధాని కావడం ఖాయమంటూ రాహుల్ తిరుపతి నుంచి తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.
తాను ఈ దేశ ప్రధాని కావడం ఖాయమని, శ్రీవారి ఆశీస్సుల కోసం తాను తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని, శ్రీవారి దర్శనంతో తనకు ఓ అనుభూతి కలిగిందని, తనకు శ్రీవారి ఆశీస్సులతో పాటు దేశ ప్రజల ఆశీస్సులున్నాయని, ఈ ఎన్నికల్లో దుష్టశక్తులను ఓడించి దేశ సమగ్రతను కాపాడే కాంగ్రెస్ పార్టీకి ప్రతిఒక్కరూ ఓటెయ్యాలని తిరుపతి సభనుంచి రాహుల్‌గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి సభలో మోడీ ఏపికి ప్రత్యేక హోదా మాటివ్వడం ఓ ప్రధానిగా కాదని, ఆయన శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చిన మాటను నేడు ఆయన మాట తప్పారని, తానుమాత్రం తప్పక తన తొలి సంతకాన్ని ప్రధాని అయిన వెంటనే చేస్తానంటూ సభికుల హర్షధ్వానాల మధ్య రాహుల్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు నిధుల మంజూరు విషయంలో న్యాయం చేస్తామంటూ పేర్కొన్నారు. ఏపిలో రానున్న ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా తాము హోదా విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.