ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. సోమవారం దీక్షా స్థలికి చేరుకున్న ఆయన ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబును కలిసి దీక్షకు మద్దుతు తెలిపారు. ఇక్కడ ఉన్న మీకు ఒక ప్రశ్న, ఓ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రధానమంత్రి ఎక్కడైనా ఉంటారా అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ ప్రధాని మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకిచ్చిన హామీలను ఆయన విస్మరించారన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని దుయ్యబట్టారు. ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని ధ్వజమెత్తారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండా అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ఏపీ ప్రజల సొమ్మును దోచి అంబానీకి కట్టబెట్టారన్నారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు. మాట ఇచ్చి నిలుపుకోలేని ఘనత వహించిన ప్రధాని దేశానికి అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ప్రధాని ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఇండియాలో భాగం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం నిమిషాల్లో జరుగుతుందని హామీ ఇచ్చారు.
మరో పక్క, చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఉద్ఘాటించారు. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుందని, అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడికి వరకు వచ్చారన్నారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి పాలించాలని చూస్తున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలన్నారు. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదని హితవు పలికారు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఈరోజు రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు తెలుపనున్నాయి.