తెలంగాణా నుంచి మరో కేంద్ర సంస్థ, ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తుంది... ప్రయాణికులకు అతి తక్కువ ధరల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందజేయాలన్న లక్ష్యంతో రూపొందిన రైల్ నీర్ ప్రాజెక్టు, తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసింది... ఐదువేల మందికి ప్రత్యక్షంగా, మరో ఐదువేల మందికి పరోక్షంగా ఉపాధినివ్వగలిగే ఈ ప్రాజెక్టును హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు 2012 లోనే సన్నాహాలు మొదలయ్యాయి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో రూ.50 కోట్లకు పైగా అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటివరకూ భూమిని, వనరులను కేటాయించలేదు.
దాంతో ప్రతిష్టాత్మ కమైన ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసింది. నూజివీడు దగ్గర దీన్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఆర్సీటీసీకి ఎకరం భూమిని కేటాయించింది. దీంతో తెలంగాణాలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు పై ఆశలు వదులుకున్నట్టే అయింది... రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు అధిక ధర వెచ్చించి ప్రైవేటు మినరల్ వాటర్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రయాణికులకు తక్కువ ధరలో మినరల్ వాటర్ను అందజేసే ఉద్దేశంతో తెలంగాణాలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఐఆర్సీటీసీ ముందుకొచ్చింది.. రోజుకు లక్ష లీటర్ల మంచినీటిని శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు చేస్తామని 2012లోనే అప్పటి ఉమ్మడి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
ఫ్యాట్ సిటీ వద్ద 4ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు మంచినీటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చెయ్యాలని రైల్వే శాఖ కోరింది... అప్పటి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. కానీ ఆ తరువాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వెనక్కు వెళ్లింది. ఇప్పుడు వచ్చిన తెలంగాణా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ పై శ్రద్ధ తీసుకోలేదు... దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆంధ్రప్రదేశ్ రంగలోకి దిగి, భూమి కూడా ఇవ్వటానికి రెడీ అయ్యింది... ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే ప్లాంట్ లోనే కాక, ప్రాజెక్ట్ నుంచి రైల్వే స్టేషన్లకు, రైళ్లకు వాటర్ బాటిళ్లను సరఫరా చేసేందుకు రవాణా వ్యవస్థ, సిబ్బంది అవసరం ఉంటుంది. వాటర్ బాటిళ్ల విక్రయం పైనా పలువురు ఉపాధి పొందుతారు.