రాష్ట్రానికి రావల్సిన మరో సంస్థ, కేంద్రం గుజరాత్ కి తీసుకెళ్ళి పోయింది... దేశంలో తొలిసారిగా రైల్ యూనివర్సిటీ పెడుతున్నారు అని తెలుసుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా స్పందించారు.. దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక రైల్ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదిస్తూ లెటర్ రాసారు... అయితే, అన్నిటి లాగానే, ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనల పై కూడా కేంద్రం నీళ్లు చల్లింది. ఈ విషయం స్వయంగా కేంద్రమే రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడించింది.
ఈ యూనివర్సిటీని గుజరాత్‌లోని వడోదర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహెయిన్ శుక్రవారం రాజ్యసభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రైల్ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు గతంలోనే కోరినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిని వడోదరలో ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఈ నెల 20న ఆమోదముద్ర వేసిందని తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పామని చెప్పారు...
భవిష్యత్తులో మరో రైల్ వర్సిటీని నిర్మించాలని భావిస్తే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టే విషయం పరిగణనలోకి తీసుకుంటామని బంపర్ ఆఫర్ ఇచ్చారు... దీంతో ప్రతిష్టాత్మక రైల్ యూనివర్సిటీ పై కూడా రాష్ట్రం ఆశలు వదులుకుంది... దీంట్లో రాష్ట్రానికి జరిగిన ఇంకో నష్టం ఏంటి అంటే, చంద్రబాబు రాష్ట్రంలో రైల్ యూనివర్సిటీ పెట్టమని ప్రతిపాదిస్తే, దానికి స్పందించి, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని కేంద్రం అడగటం, దానికి రాష్ట్రం స్పందించి సవివరంగా రిపోర్ట్ తయారు చేసి ఇవ్వటం, చివరకి అది చెత్త బుట్టలో పడేసి, ప్రాజెక్ట్ గుజరాత్ తీసుకుపోవటం చకచక జరిగిపోయాయి...