వాల్తేరు డివిజన్‌పై మొదటి నుంచీ పెత్తనం చలాయిస్తున్న ఒడిసా, మరోసారి కేంద్రంలో చక్రం తిప్పింది. ఏకంగా డివిజన్‌ను రద్దు చేయించింది. కొత్తగా రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేయించుకుంటోంది. ఈ విషయంలో ఒడిసా బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మాత్రం జోన్ ప్రకటిస్తే చాలనే హడావుడిలో వాల్తేర్ డివిజన్ రద్దు ముప్పునే పట్టించుకోలేదు. వారు కోరుకొన్న ప్రకటనను బుధవారం రాత్రి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేశారు. దక్షిణకోస్తా రైల్వే పేరిట విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ప్రకటించిన కేంద్ర మంత్రి, అదే నోటితో వాల్తేరు డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. చిరకాల కల నెరవేసిందని సంతోషించిన ఉత్తరాంధ్ర వాసులు, మంత్రి పెట్టిన మెలికతో హతాశులయ్యారు.
ఈ ప్రకటనను విశాఖవాసులు, ప్రజాసంఘాలు, వాల్తేర్ డివిజన్ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రం ఇంద దాగా చేస్తుందని అనుకోలేదని వాల్తేరు డివిజన్ పరిధిలోని ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ‘‘125 ఏళ్ల చరిత్ర గల వాల్తేర్ డివిజన్ రద్దు చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కసి ఉంటే తప్ప 18వేలమంది ఉద్యోగులతో కూడిన డివిజన్‌ను రద్దు చేయడం జరగదు’’ అని వారు మండిపడుతున్నారు. ఇది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసిన తప్పిదం (బ్యూరో, పొలిటికల్ బ్లండర్)గా అభివర్ణిస్తున్నారు. విశాఖ రైల్వేజోన్ కోసం కేంద్రంపై ఆంధ్రప్రదేశ్ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీనిపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేయడంతో ఒడిసా అప్రమత్తమైంది. సహజంగా చిన్నపాటి డిమాండ్ సాధించుకోవాలంటేనే అక్కడి ప్రజలు రైల్వే ట్రాక్‌లపైకి వచ్చి మెరుపు ఆందోళనలు చేస్తుంటారు. అయితే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా నుంచి కొంత భాగం వేరుచేసి విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటన చేసినా, ఒడిసా నేతలు, ప్రజలు మౌనంగా ఉండడం నాలుగేళ్ల వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జోన్ తప్పదని సంకేతాలు రావడంతో ఒడిసా నేతలు అప్రమత్తమై వాల్తేర్ డివిజన్ రద్దుకు వ్యూహం పన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
వాల్తేర్ డివిజన్‌కు ఆయువు పట్టులాంటి కేకే లైన్, కేఆర్ లైన్ డబ్లింగ్ పనులు వేగవంతం చేశారు. కిరండోల్, బచేలి ప్రాంతాల నుంచి ఇనుమఖనిజం తరలింపు మరింత పెంచేందుకు రెండోలైన్ నిర్మాణం జరుగుతోంది. ఇది త్వరలో పూర్తికానున్నది. అలాగే, రాయగడ, కోరాపుట్ పరిసరాల్లో పలు స్టేషన్ల అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం భారీగా చేపట్టారు. ఇలా అన్ని హంగులున్నాయి కాబట్టి ఈ రెండు సరుకురవాణా లైన్లు రాయగడ పరిధిలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఒడిసా బీజేపీ నేతలు చడీచప్పుడు లేకుండా తెరపైకి తెచ్చి సాధించుకున్నట్లు తెలుస్తోంది. తూర్పుకోస్తా రైల్వేకు వచ్చే అనేక ప్రాజెక్టులు మొదటి నుంచీ ఒడిసాకే పరిమితం చేస్తూ వస్తున్నారు. సంబల్‌పూర్, వాల్తేర్ డివిజన్‌ల పరిధిలోని ఒడిసా ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు మంజూరు చేయించుకున్నారు. చివరకు కొత్తగా ర్యాకులు వచ్చినా వారికి కేటాయించగా మిగిలితేనే వాల్తేరుకు ఇచ్చేవారు. అంత వివక్ష చూపే ఒడిసా బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయడానికి రాయగడ డివిజన్‌ను తెరపైకి తెచ్చి రూ.వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే సరుకు రవాణా లైన్లను తీసుకుపోతున్నారు. ఫలితంగా ఉత్తరాంధ్ర మూడు ముక్కలై కొంతభాగం విజయవాడ, ఎక్కువ భాగం రాయగడ, కొంతభాగం ఖుర్దా డివిజన్‌లో ఉంటుంది. ఇలాంటి జోన్ ప్రకటనతో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యకమవుతోంది. కాగా, నూతన రైల్వేజోన్ ప్రకటనతో విజయవాడ డివిజన్ పరిధి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నౌపాడ వరకు విజయవాడ డివిజన్‌లో కలవనున్నదని తెలుస్తోంది. మొత్తం 250 కిలోమీటర్ల మేర మెయిన్ లైన్ విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుందని ప్రాథమికంగా తెలియవస్తోంది.