పొలానికి వెళ్లి పని చేసే రైతులకు, ఎప్పుడూ ఇబ్బందే... పాము కాటుకు గురవుతారో తెలియదు, కరెంటు షాక్ కొడుతుందో తెలియదు, పిడుగులు పడతాయో తెలియదు. ఇలా ప్రతి నిమషం రిస్క్ తో కూడిన పని చేస్తూ, ఆ మట్టిలోనే కష్టపడుతూ, కష్టమైన, నష్టమైన భరిస్తూ, మనకు పంట పండిస్తాడు రైతన్న. అయితే, ఇప్పటికే అసంఘటిత రంగంలోని కార్మికులకు చంద్రన్న బీమా పథకం అమలవుతోంది. ఏ రకమైన భీమా రైతులకు లేదు. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, రాష్ట్రంలో రైతుకు కూడా బీమా భరోసా దక్కనుంది. దేశంలో పంటలకు బీమా కల్పనే ఇంకా అంతంతమాత్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో రైతులకు వ్యక్తిగతంగా బీమా భద్రత కల్పించనున్నారు. పింఛన్లతోపాటుగా అత్యంత సంతృప్తినిస్తున్న పథకంగా చంద్రన్న బీమా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అదే తరహాలో రైతు కుటుంబాలకు కూడా రక్షణ ఉండేలా బీమా సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
ఏరువాక సందర్భంగా గురువారం దీనిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. 18 నుంచి 70 ఏళ్లు మధ్యనున్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. వారి వార్షిక ఆదాయం రూ.2.5లక్షలు మించి ఉండకూడదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 50 లక్షల మంది రైతులకు బీమా దన్ను లభిస్తుంది. చంద్రన్న రైతు బీమా పథకం కోసం కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికంగా భరిస్తుంది. మొత్తం ప్రీమియంలో రూ.21.91కోట్లు రాష్ట్ర ప్రభుత్వం.. రూ.18.70కోట్లు కేంద్రం చెల్లిస్తుంది. ఈ పథకానికి చంద్రన్న రైతు బీమా అనే పేరు పెట్టాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. పాలసీదారు చనిపోతే వారి కుటుంబానికి రూ.30వేల నుంచి రూ.5లక్షలు పరిహారం ఇస్తారు. 18-50 ఏళ్లు వయసున్న రైతు సహజ మరణం పొందితే రూ.2లక్షలు ఇస్తారు. 50-60 ఏళ్లు వారైతే రూ.30వేల పరిహారం ఇస్తారు. 18-70 ఏళ్లు మధ్యవయసులోని వారు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబాలకూ రూ.5లక్షల పరిహారం అందిస్తారు.
శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5లక్షలు చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యమైతే రూ.2.5లక్షలు ఇస్తారు. ఆయా కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలుంటే వారికి ఏడాదికి రూ.1200లు ఉపకార వేతనం ఇస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ చదివే పిల్లలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్రంలో చంద్రన్న రైతు బీమా ద్వారా ప్రయోజనం పొందనున్న 10.75లక్షల మంది రైతుల్లో ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారన్న లెక్కలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే అత్యధిక రైతుల ప్రజాసాధికార సర్వేలో ఉన్నారు. సర్వేలో నమోదు కానివారికీ మరో అవకాశం ఇస్తారు. ఈ పథకం అమలులో కార్మికశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. చంద్రన్న బీమా తరహాలోనే ఈ పథకంలో కూడా మరణించినవారి కుటుంబానికి 10 రోజుల్లోనే పరిహారం అందేలా నిబంధనలను రూపొందించారు. ఇప్పటికే సెర్ప్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు చంద్రన్న బీమాను బాగా అమలుచేస్తుండడంతో వారికే దీని అమలును కూడా అప్పగించాలని నిర్ణయించారు.