సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసినవారు ఎందరో ఉన్నారు. వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నికలు వచ్చాయంటే తారలు ఏదో ఒక పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారిపోతారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తోన్న అభ్యర్థి మాగంటి రూప సీనీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినవారే. ఆమె నటుడు మురళీ మోహన్ కోడలు కాగా, ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తే యువకుడు మార్గాని భరత్ రామ్ కూడా నటుడే కావడం విశేషం.
ఇక, 2017లో ఓయ్ నిన్నే అనే చిత్రంతో నటుడిగా భరత్ పరిచయమయ్యారు. అయితే, భారీ తారాగణంతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఆ తర్వాత భరత్ సినిమాలకు విరామం ఇచ్చి, రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు పారిశ్రామికవేత్త. ఆర్ధికంగా బాగా స్ధితిమంతుడు. వీటిని పరిగణనలోకి తీసుకునే భరత్‌కు వైసీపీ అధినేత టిక్కెట్టు కేటాయించారు. భరత్ కొద్ది రోజులు టీడీపీలోనూ బాగా యాక్టివ్‌గా పనిచేశారు. మంత్రి నారా లోకేశ్‌కు భరత్ సన్నిహితుడిగా ప్రచారం జరగ్గా, ఆయనకు రాజమండ్రి రూరల్ టిక్కెట్టిస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది.
కానీ, అనూహ్యంగా భరత్ రామ్ వైసీపీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్నారు. ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యన్నారాయణ బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకుంది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో మూడు ప్రధాన పార్టీలూ బలంగా ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది.