ఉదయం అవిశ్వాస తీర్మానం సందర్భంగా, గల్లా జయదేవ్ లేవనెత్తిన విభజన అంశాల పై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. అయితే, ఈ సారి కూడా ఎప్పటి లాగే మనకు నిరాశే మిగిలింది. అది చేసాం, ఇది చేసాం, ఇంకా చేస్తాం అంటూ, పాత పాటే పాడారు కేంద్ర రాజ్‌నాథ్ సింగ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. 14వ ఫైనాన్స్ కమిషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని తేల్చి చెప్పారు. ఏపీ రెవెన్యూలోటు భర్తీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చామన్న ఆయన.. విభజన చట్టంలో హామీలు దాదాపుగా అమలు చేశామన్నారు. మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామన్నారు. విభజన తర్వాత ఏపీ సమస్యలేంటో తమకు తెలుసు అంటూ ప్రత్యేక సాయం కింద ఏపీకి నిధులు ఇచ్చేందుకు సిద్ధమన్నారు.
కేంద్ర నిధుల్లో రాష్ట్రాల వాటా ఇప్పటికే పెంచామన్నారు. ప్రత్యేక సాయం కింద ఏపీకి నిధులిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఆయన పాత అంకెలే మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రాజ్‌నాథ్ ప్రసంగానికి టీడీపీ ఎంపీలు అడ్డుతగిలారు. ఎంత అడ్డు పడినా, ఆయన చెప్పింది చెప్పి ముగించారు. మధ్యలో చంద్రబాబు మమ్మల్ని విడిచి బయటకు వెళ్ళినా, మాకు మిత్రుడే అంటూ, మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసారు. అవన్నీ కాదు, మేము లేవనెత్తిన సమస్యల పై చెప్పండి అంటి టిడిపి ఎంపీలు ఎంత మొత్తుకున్నా, తమ శక్తి వంచన లేకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. చాలా వరకు చేశామని, ఇంకా చేస్తామని రాజ్‌నాథ్ చెప్పారు.
అంతకు ముందు లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగాన్ని టీడీపీ ఎంపీలు అడ్డుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ దేశంలో భాజపా వికాసం.. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడుతుండగా.. తెదేపా సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయన ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పొడియం వద్దకు చేరుకొని వారు నినదించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను కాసేపు స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీల అమలు అంశంపై అవిశ్వాస తీర్మానం పెడితే.. పలు రాజకీయ పార్టీలు తమ రాష్ట్రంలో నెలకొన్న అంశాలతో పాటు దేశంలో సమస్యలు గురించి మాట్లాడుతున్నాయే తప్ప ఆంధ్రప్రదేశ్ అంశాన్ని ప్రస్తావించడంలేదనే విమర్శలు వస్తున్నాయి.