బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్, జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించి గెలిపించుకున్న జగన్ మోహన్ రెడ్డి పై, తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చెయ్యటం చూస్తుంటే, రాష్ట్రంలో మరో సరికొత్త రాజకీయం మొదలైందనే అనుకోవాలి. నెల గడిచింది, మరో వారంలో రెండో నెల పూర్తవుతుంది, అప్పుడే ప్రజల్లో జగన్ ను గెలిపించి తప్పు చేసామా అనే భావన వచ్చింది అంటూ, రాం మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన, ఈ వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి వీరంగం చేస్తున్నాడు, మనం పత్రికల్లో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోతున్నారు, కొద్ది రోజుల్లోనే జగన్ తన విశ్వరూపం చూపించి, ప్రజలను భయపెడుతున్నారు అంటూ రాం మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
మరో పక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ రోజు ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. కేవలం జగన్ వైఖరి వల్లే అమరావతికి రుణం ఇచ్చే విషయంలో బ్యాంకులు వెనక్కు వెళ్లిపోతున్నాయని అన్నారు. కేవలం రెండు నెలల్లోనే జగన్ ఒక విఫల సియంగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. జగన్ చెప్పే నీతి మాటలకు, చేసే పనులకు ఎక్కడ పొంతన లేదని అన్నారు. తన తండ్రి గురించి జగన్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ, రాజకీయ వారసుడిని అని చెప్పుకుంటారని, రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ, జగన్ లా ప్రవర్తించ లేదని, ఎప్పుడూ పోలీస్ పాలన చెయ్యలేదని అన్నారు. అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో అరాచకం జరిగే ప్రమాదం ఉందని అన్నారు.
అయితే బీజేపీ నేతలు అన్ని వైపుల నుంచి జగన్ ప్రభుత్వం పై, ఆయన విధానాల పై విరుచుకు పడుతున్నా, జగన్ వైపు నుంచి, ఆయన ప్రభుత్వం, పార్టీ వైపు నుంచి, కనీస స్పందన లేదు. ఎన్ని విమర్శలు చేసినా, కనీసం వారికి కౌంటర్ ఇవ్వటం కాని, అలా కాదు ఇలా అని కాని చెప్పే సాహసం చెయ్యటం లేదు. తెలుగుదేశం నేతలు ఏమి చెయ్యకపోయినా వారి మీద పడిపోయే జగన్, బీజేపీ నేతలు అంత ఇదిగా తిడుతున్నా, విమర్శలు చేస్తున్నా, కనీసం స్పందించటం లేదు. అలాగే వాళ్ళ పార్టీ నేతలు కూడా, అసలు బీజేపీ నాయకుల విమర్శలకు కౌంటర్ ఇవ్వటం లేదు. మరి జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ అంటే భయమో, లేక అది వారి పార్టీ విధానమో కాని, వైసిపీ అభిమానులు మాత్రం, బీజేపీ అంతలా తిడుతుంటే, జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారో అంటూ ఆలోచనలో పడ్డారు.