వచ్చేనెల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ (66).. రాజ్‌నందగావ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం ఆయన తన భార్య వీణా సింగ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జీ అనిల్ జైన్, ఇతర పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. అయితే, నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన.. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ (46) కాళ్లను మొక్కారు. రాజకీయ రంగంలోనూ ఆయన కన్నా రమణ్ సింగ్ చాలా సీనియర్. 2003 నుంచి ఆయన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ఉంటోన్న విషయం తెలిసిందే.
ఆయన విద్యార్థిగా ఉన్న సమయంలోనే 1970లో భారతీయ జన సంఘ్‌లో చేరారు. అనంతరం 1976-77 కాలంలో ఆ పార్టీ యువ విభాగ అధ్యక్షుడయ్యారు. మరోవైపు, యోగి ఆదిత్యనాథ్ 1972లో జన్మించారు. కాగా, రాజ్‌నందగావ్ నుంచి రమణ్ సింగ్ ఇప్పటికి రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలనుకుంటున్నారు. ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీ మేనకోడలు కరుణా శుక్లాను పోటీకి దింపనుంది.
నామినేషన్ వేసిన అనంతరం రమణ్ సింగ్ మాట్లాడుతూ... ‘బూత్ స్థాయి నుంచి పార్టీ బలంగా ఉంది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి భాజపాను రాష్ట్రంలో నాలుగోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారు’ అని చెప్పారు. కాగా, ఆ రాష్ట్రంలో నవంబరు 12న జరగనున్న మొదటి దశ ఎన్నికలకుగానూ నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ రోజే చివరిరోజు. ఆ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రెండో దశ ఎన్నికలు నవంబరు 20న జరుగుతాయి. ఈ ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి.