ఓ మంచి నాయకుడైన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకు వెళుతోందని యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. అమరావతిలో యోగా గురువుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు అభిమానులు, తెలుగుదేశం నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు తనకు మంచి మిత్రుడని, ఆయనతో ప్రేమ పూర్వక సంబంధాలున్నాయని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిత్యమూ శ్రమించే చంద్రబాబంటే తనకెంతో ఇష్టమని పొగడ్తల వర్షం కురిపించారు.
చంద్రబాబు డైనమిక్ లీడర్ అని, కొత్త రాష్ట్రమైన ఏఫీ అభివృద్ధికి ఆయన బాగా కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీకి ప్రత్యేకహోదా హామీని ప్రధాని మోదీ నెరవేర్చాలని కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అంటూ, మోడీకి చురకలు అంటించారు. పతంజలి సంస్థ తరపున కేరళ వరద బాధితుల కోసం రూ.2 కోట్ల విలువ చేసే సరుకులు పంపినట్టు చెప్పారు. రాజకీయాల గురించి బాబా మాట్లాడుతూ, తాను క్రియాశీల రాజకీయాల్లో లేనని, 2019 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయని అన్నారు.
యోగా గురువులకు ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. పతంజలి సంస్థ తరఫున, వచ్చే రెండు నెలల కాలంలో దేశంలో 20 వేల మంది నిరుద్యోగులకు ఉపాధిని చూపనున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో ఏపీలో 1000 ఉద్యోగాలు ఉంటాయని రాందేవ్ బాబా చెప్పారు. నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని దేశం నుంచి పారద్రోలాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. కింభో యాప్, వాట్స్ యాప్ ను అధిగమిస్తుందని, త్వరలో పతంజలి సిమ్ కార్డులనూ విడుదల చేస్తామని అన్నారు. మరో పక్క పతంజలి గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే.