హైకోర్టు తీర్పుతో తిరిగి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించినట్లు రమేష్ కుమార్ తెలిపారు. వ్యక్తుల కన్నా వ్యవస్థ గొప్పదని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి ఉందని చెప్పారు. "ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తిరిగి నేను విధుల్లో చేరాను. గతంలో వ్యవహరించిన మాదిరిగానే నేను నా విధులను నిస్పక్షపాతంగా నిర్వర్తిస్తాను. పరిస్థితులు చక్కబడిన వెంటనే రాష్ట్రంలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి చేపడతాను. ఇందులో భాగస్వామ్యమైన వ్యక్తులతో రాజకీయ పార్టీలతో చర్చించిన మీదట ముందుకెళతాం. వ్యక్తులు ఎప్పుడూ శాశ్వతం కాదు. రాజ్యాంగ వ్యవస్థలు, అవి పాటించే విలువలే శాశ్వతం. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ఆ పదవుల్లోకి వచ్చిన వారికి ఆ వ్యవస్థలను రక్షించాల్సిన ఆవశ్యకత, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటాయి. " అని అన్నారు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే అని పిటిషనర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. కరోనా విషయంలో ప్రభుత్వం మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆయన...రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం తప్పులు చేస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా ప్రభుత్వ వైఖరి సరిగా లేదని తెలిపారు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పాజిటివ్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తన వద్ద తప్పులు పెట్టుకుని వ్యవస్థలను నిందించడం సరికాదన్నారు. నిమ్మగడ్డను తప్పించిన తీరు, కనకరాజ్‌ను నియమించిన తీరు దోషపూరితంగా ఉందని కామినేని వ్యాఖ్యానించారు.
టీడీపీ మాజీ మంత్రి
అచ్చెన్నాయుడు, స్పందించారు "రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాల్సిందేనన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. హైకోర్టు తీర్పుతో ఏపీలో ఇంకా ప్రజాస్వామ్యం బతికేఉందన్న నమ్మకం కలిగింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ తప్పూ చేయలేదని మేము చెబుతూనే ఉన్నాం.. కరోనా ఉధృతి నేపథ్యంలో నిమ్మగడ్డ ముందుచూపుతో ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల వాయిదాను జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల అధికారిని కులం పేరుతో దూషించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇబ్బందులకు గురిచేశారు. ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని, అపహాస్యం చేసింది. వ్యవస్థలను నాశనం చేసింది. న్యాయవ్యవస్థ వల్లే ఏపీలో ప్రజాస్వామ్యం కాపాడబడింది. హైకోర్టు తీర్పు ఈ ముఖ్యమంత్రికి రెండు వైపులా చెడాపెడా కొట్టే విధంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నింటినీ హైకోర్టు రద్దు చేసింది . సిగ్గుంటే ఈ ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి." అని అన్నారు