ఎట్టకేలకు ఎన్నికల కమీషనర్, రమేష్ కుమార్, మౌనం వీడారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కార్యకలాపాలు, హైదరాబాద్ నుంచే చెయ్యాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు, ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ఈ రోజు నుంచి ఆయన కొత్త కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో, హైదరాబాద్ నుంచే విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడలో తనకు ముప్పు ఉంది అంటూ, రెండు రోజుల క్రితం కేంద్ర హోం శాఖకు , రమేష్ కుమార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం సీఆర్పీఎఫ్ పోలీసులును భద్రతగా ఏర్పాటు చేసారు. వారంతా గురువారం నుంచి విధులు చేప ట్టారు.గన్నవరంలోని సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ చెందిన ఒక ఎస్ఎ,1 హెడ్ కానిస్టేబుల్, ఎనిమిది మందికానిస్టేబుళ్ళతో భద్రత కల్పించారు. దీంతో ఇప్పటి వరకు ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద నున్న రాష్ట్ర ప్రభుత్వ పోలీసు బలగాలు వైదొలిగాయి. ఎన్నికల అధికారికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని, ఆయనకు ఆయన కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక బహిరంగ లేఖ రాసారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమీషనరే స్వయంగా కేంద్ర హోంశాఖకు అయిదు పేజీల లేఖను రాసినట్లు విస్తృతంగా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని అనుసరించి రమేష్ కుమార్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించినట్లు సమాచారం ప్రచారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అధికార పార్టీ నుంచి తనకు ఇబ్బందులున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నట్లు సామాజిక, ప్రసార మాధ్యమాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ లో తనకు, తన కుటుంబానికి ఎలాంటి భద్రతా లేదని రమేష్ కుమార్ కేంద్రానికి వివరించారంటూ ప్రచారం జరిగింది. రాష్ట్ర పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్ చరిత్ర కక్ష సాధింపు వైఖరితో ఈ నిర్ణయానికి వచ్చినట్లు రమేష్ కుమార్ లేఖలో పెర్కున్నారు.
ఈ పరిణామాల నడుమ ప్రభుత్వాని అస్థిరపరి చేందుకు విపక్షం కుట్రలో భాగంగానే ఈ లేఖ సృష్టి జరిగిందని అధికార పార్టీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ వ్యవహరంపై తాము డీజీపీని కలుస్తామని చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే అధికారపార్టీ ఎంఎల్‌ఎలు గురువారం డిజీపీని కలుసుకుని ఫిర్యాదు చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు ఎన్నికల కమీషన్ నిర్ణయాన్ని కొనసాగించాలని ఆదేశించింది. అయినా కూడా ఎన్నికల కమీషనరును రాజీనామా చేయాలని, ఆయన రాసినట్లు చెప్పబడిన లేఖ టిడిపి కార్యాలయం నుంచి హోంశాఖకు వెళ్ళిందని అధికారపార్టీ నేతలు ఆరోపించారు. అయితే ఈ లేఖ నిజం అంటూ, కేంద్ర హోం శాఖ చెప్పిన తరువాత కూడా, వైసీపీ ఇలా ప్రచారం చేస్తుంది.