ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించే కీలకమైన ఈడబ్ల్యూఎస్ బిల్లు లోక్‌సభలో చర్చకు వచ్చిన నేపథ్యంలో తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు విజ్ఞప్తి చేశారు. బిల్లుపై జరిగే చర్చలో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వాలని అభ్యర్థించారు. మంగళవారం పార్లమెంటులో ఆమెను కలిసి వినతి పత్రం అందించారు. కానీ ఆమె సానుకూలంగా స్పందించలేదు. ఈ బిల్లుపై తమకు అనేక సందేహాలున్నాయని, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని రామ్మోహన్ తెలిపారు. బిల్లుపై సెక్షన్లవారీగా చర్చ జరిపి ఓటింగ్ చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల కు చెందిన అన్నాడీఎంకే, టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేయడంతో తాము ప్రాతినిధ్యం వహించే ప్రజల గొంతును వినిపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రజల తరఫున ఈ అంశంపై చర్చించడానికి వీలుగా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వినతిపత్రంలో కోరారు. కాగా.. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు నిరసనలను కొనసాగించారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీజీ విగ్ర హం దగ్గర, పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం ముందు ప్లకార్డులు పట్టుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తున్న వివిధ పార్టీల సభ్యుల విషయంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ ఒక్కో రకంగా స్పందించారు. తెదేపా, అన్నాడీఎంకే సభ్యులపై నిబంధనల కొరడా ఝళిపించి సస్పెండ్ చేసిన ఆమె అదే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల సభ్యుల విషయంలో మాత్రం చర్యలు తీసుకోలేదు. వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారన్న కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 42 మంది ఎంపీలపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్ మరో నలుగురిపై చర్య తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వెల్‌లోకి వచ్చి ఆందోళనకు దిగిన తెదేపా సభ్యుడు ఎన్.శివప్రసాద్, అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు పి.వేణుగోపాల్, పార్టీ సభ్యులు రామచంద్రన్, కె.గోపాల్‌లను 374-ఎ నిబంధన కింద సభ నుంచి రెండురోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగిన అరగంట తర్వాత కాంగ్రెస్, సమాజ్‌వాదీ సభ్యులు అదే వెల్‌లోకి వచ్చి సభా కార్యకలాపాలు అడ్డుకున్నా చర్యలు తీసుకోలేదు.