విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP)-రాష్ట్రీయ ఇస్పాట్ నిగం లిమిటెడ్ (RINL) ప్రైవేటీకరణ పై కేంద్ర కాబినెట్ తీసుకున్న నిర్ణయంపై తమ వ్యతిరేకతను తెలియజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి శ్రీకాకుళం MP రామ్ మోహన్ నాయుడు గారు లేఖ ద్వారా అభ్యర్ధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యావత్ దేశంలో ప్రసిద్ధమైనది, భారతీయులంతా గర్వించే భారీ పరిశ్రమ, దీనిని ప్రైవేటు సంస్థలకు అమ్మడం సరికాదని తెలుపుతూ, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1966 తరవాత దశాబ్దకాలం పాటు "విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు" నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం చేసారు. వేలాది విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయి, 32 మంది తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్న హక్కు ఇది. VSPను నిర్మించడానికి 64 గ్రామాల ప్రజలు వారి ఇళ్లను ఖాళీ చేసి, 22,000 ఎకరాల భూమిని తాగ్యం చేశారని పేర్కొన్నారు. కేవలం కొంత కాలంగా నష్టాలను చవిచూసిందన్న సాకుతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఉచితం కాదని లేఖలో రాశారు. సొంత గనులు లేకపోవడం వల్ల, సుదూర ప్రాంతాల నుంచి ముడి సరుకులు తెచ్చుకోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, కర్మాగార విస్తరణ పనులకు ఇటీవల చేసిన అప్పుల కారణంగా వడ్డీ భారం పెరగడం వంటి కారణాలు కూడా నష్టాలకు కారణమేనన్నారు. దేశవ్యాప్తంగా డిమాండ్ లేకపోవడం వలన ఆశించిన అమ్మకాలు జరగడం లేదని, దేశంలోని మిగితా స్టీల్ ప్లాంట్లది కూడా ఇదే పరిస్థితన్నారు. అన్ని SAIL యూనిట్లలో ప్రభుత్వ పెట్టుబడి ఈక్విటీ రూపంలో వుంటే VSPలో మాత్రం పెద్ద మొత్తాన్ని లోన్ మరియు ప్రిఫరెన్షియల్ షేర్లుగా ఇచ్చారు, దీని కారణంగా RINL / VSP ఉత్పత్తి ప్రారంభించే సమయానికే నష్టాల్లో వుంది.
SAIL మరియు TISCO ఆధ్వర్యంలో వున్న ఇతర ఉక్కు కర్మాగారాలకు క్యాప్టివ్ ఇనుప ఖనిజ గనులు కేటాయించబడ్డాయి కానీ VSP/RINLకు మాత్రం ఇప్పటివరకు క్యాప్టివ్ ఇనుప ఖనిజ గనులు లేవు. కేవలం ఇనుప ఖనిజం సేకరణపైనే సంవత్సరానికి దాదాపు రూ. 800-1000 కోట్లు ఖర్చవడం వలన VSP లాభాలు తగ్గాయని, మన రాష్ట్రంలో వున్న పరిశ్రమలకు ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమను చూపించారని విమర్శించారు. తాను రాసిన అభ్యర్థన గురించి విలేఖరులతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కులో 17 వేల మంది పర్మనెంట్ ఉద్యోగులతో పాటు మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, ప్రైవేటీకరణ వల్ల వీరి ఉద్యోగాలకు, వీరి కుటుంబాల భవిష్యత్తుకు తీరని నష్టం కలుగుతుందని తెలిపారు. 2000ల సంవత్సరంలో వారి తండ్రి, అప్పటి శ్రీకాకుళం MP శ్రీ ఎర్రన్నాయుడు గారు కూడా VSP ప్రైవేటీకరణను పార్లమెంటులో గట్టిగా అడ్డుకున్నారని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు తాను కూడా ఉత్తరాంధ్ర ప్రజల హక్కైన స్టీల్ ప్లాంట్ కోసం వెనక్కి తగ్గకుండా పోరాడతానన్నారు. 1990 మధ్యలో VSP నష్టాల్లో పేరుకుపోయి, ఇక పారిశ్రామిక ఆర్ధిక పునర్నిర్మాణ బోర్డు (BIFR) జోక్యం చేసుకోబోయే సమయంలో అప్పటి ప్రధాన మంత్రి శ్రీ ఎ. బి. వాజ్‌పేయి VSP ఆర్థిక స్థితిని పునరుద్ధరించడానికి వ్యక్తిగత ఆసక్తిని తీసుకున్నారు.
VSP రుణాలను ఈక్విటీ మరియు ప్రిఫరెన్షియల్ షేర్లుగా మార్చారు. అప్ప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో, VSP కార్మికుల కృషితో, RINL / VSP తిరిగి లాభాలను ఆర్జించడం ప్రారంభించిందని తెలిపారు. వాజ్‌పేయి గారి ప్రభుత్వాన్ని ఆదర్శనంగా తీసుకొని, VSPను మళ్ళీ లాభాల బాటలో నడిపించాలని కోరారు. ఇంత జరుగుతాన్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకుండా ఉండటం వారి చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఆంధ్ర ప్రజలకు భారీ నష్టం జరుగుతూన్నా, 28 MPలు వున్న ఈ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడంలేదని ఘాటుగా ప్రశ్నంచారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. దశాబ్దాల వైభవానికి గుర్తుగా, నవరత్న హోదాతో వున్న గొప్ప పరిశ్రమ నష్టాల్లోకి రావడానికి గల కారణాలను ఆన్వేషించాలి, లాభాల్లోకి తేవడానికి మార్గాలను సూచించాలి కానీ విక్రయించకూడదని . విశాఖ ఉక్కును ఆంధ్రుల ఎంతకైనా తెగించి కాపాడుకుంటారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రభుత్వ రంగ పరిశ్రమ గానే కొనసాగాలని, లేని పక్షంలో తాము ఎటువంటి పోరాటానికైనా సిధ్ధమని హెచ్చరించారు.