తుఫానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. సినీ హీరోలు మొదలుకుని పారిశ్రామికవేత్తలు వరకూ బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షపార్టీ వైసీపీ సోమవారం నాడు కోటి రూపాయిలు విరాళంగా ప్రకటించింది. నిన్న జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేస్తూ, తమ కార్యకర్తలను కూడా అక్కడకు వెళ్లి, సహాయ కార్యక్రమాల్లో పాల్గునమన్నారు. అయితే, వైసీపీ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"తుఫాను బాధితులకు విరాళం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు పక్కనబెట్టి పార్టీలకు అతీతంగా తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి" అని ట్విట్టర్ వేదికగా యువ ఎంపీ పిలుపునిచ్చారు. ఒక పక్క ఎంత విషం చిమ్మే రాజకీయాలు, వ్యక్తిగంగా వెళ్ళిపోతున్న రాజకీయాలు చూస్తున్న ప్రజలు, వైసీపీ సాయాన్ని ఒక పక్క అభినందిస్తూనే, ప్రత్యర్ధి ప్రజలకు చేసిన సాయాన్ని, ఆ ప్రాత ఎంపీగా అభినందించిన రామ్మోహన్ నాయుడిని, ప్రజలు మెచ్చుకుంటున్నారు.
మరో పక్క, తుపాను బాధితులకు సహాయం అందిస్తున్న దాతలకు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పెద్ద మొత్తంలో తుపాను బాధితులకు విరాళాలు ప్రకటించి ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారని అభినందించారు. వీరిద్దరికి ట్విట్టర్‌లో మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు తుపాను సహాయాన్ని ప్రకటించిన సినీనటులు విజయ్ దేవర కొండ తదితరులతో పాటు ఇతర సినీ రంగ ప్రముఖులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు అన్నివర్గాల వారు ముందుకు రావాలని కోరారు.