టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ పర్యటనకు వెళ్లారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యేందుకు వెళ్లారు. చంద్రబాబునాయుడు, నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుని, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఫిల్మ్ సిటీలోనే జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన రామోజీరావును కలిశారు. వీరిద్దరి మధ్యా చర్చల సారాంశం బయటకు వెల్లడికానప్పటికీ, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై చర్చలు జరిగినట్టు సమాచారం. మధ్యాహ్నం తరువాత చంద్రబాబు తిరిగి అమరావతి బయలుదేరనున్నారు. ఇదే కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గుంటారనే సమాచారం ఉన్నా, ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
ఎన్నికల ఫలితాల వెల్లడి తేదీ సమీపిస్తున్న కొద్దీ దేశ రాజకీయాల్లో చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2014 ఎన్నికల్లో వచ్చిన విధంగా బీజేపీకి స్వతహాగా, ఏ పార్టీ అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు రావని కాంగ్రెస్, బీజేపీ మిత్ర పక్షాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీయే ఈసారి అధికారం చేజిక్కించుకోవాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి కావచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ కూడా తమతో కలిసొచ్చే పార్టీల మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉంది. ఏపీలో టీడీపీ కూడా యూపీఏ ఫ్రంట్‌కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకుంది.
ఇక టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌తో కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోయేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్‌కు స్టాలిన్ ఆదిలోనే షాకిచ్చారు. కేసీఆర్ తనతో కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యారని, థర్డ్ ఫ్రంట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని.. తమ మద్దతు యూపీఏకే ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్ ఫ్రంట్ ప్రయత్నాలకు స్టాలిన్ ఆదిలోనే షాకిచ్చినట్టయింది. స్టాలిన్ తన ప్రతినిధిని అమరావతికి పంపి.. కేసీఆర్‌తో జరిగిన భేటీ గురించి చంద్రబాబుకు వివరణ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్‌కు తెరపడింది. ఇప్పుడు చంద్రబాబు రామోజీతో భేటీ కావటం, రాజకీయ వర్గాల్లో చర్చనీయంసం అయ్యింది.