ప్రస్తుత ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితి టెన్షన్..టెన్షన్‌గా ఉంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఆ నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ వర్గీయులు తమ పార్టీ గెలుపు కోసం అరాచకాలకు తెరలేపుతున్నారు. గ్రామాల్లో తిరుగుతూ టీడీపీ వర్గీయులయిన బీసీలపై బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల్లో తమకు పట్టున్న ప్రాంతాల్లో టీడీపీకి ఓట్లు పడకుండా చూడాలని ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే భానుకోటలో దళితులు, సనప, బీ యాలేరు గ్రామాల్లో బీసీలపై బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న బీసీ వర్గాలపై నియోజకవర్గంలో వరుసగా దాడులు జరిగాయి.
ప్రత్యేకించి ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి మండలాల్లో వైసీపీ బెదిరింపులు అధికంగా ఉన్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ దౌర్జన్యాలు, బెదిరింపుల్లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి సోదరుడు ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా ఈసారి గెలవాలనే లక్ష్యంతో ఆయన ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నట్లు రాప్తాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి సోదరుడి నేరచరిత్రను టీడీపీ నాయకులు సేకరించి సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌ను హత్య చేసినట్లు గతంలో ఆయనపై కేసు నమోదైంది. మొండి బకాయిల వసూళ్లకు ఒప్పందాలు చేసుకుని కిడ్నా్‌పలకు పాల్పడినట్లు పోలీసు రికార్డుల్లో నమోదైంది. ఓ సినీ నిర్మాతను కూడా కిడ్నాప్ చేయడానికి గతంలో ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు రికార్డులు చూపుతున్నాయి. ఇలా అనేక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నట్లు చూపే ఆధారాలు సేకరించి ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన చేస్తున్న అరాచకాల గురించి కూడా కమిషన్‌కు తెలియజేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీన్నిబట్టి రాప్తాడు నియోజకవర్గంలో అరాచకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో, ప్రజలు ఎంతగా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోంది. మరి ఈ నియోజకవర్గంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.