ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ నియమితులు కానున్నారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సవాంగ్‌ 1963 జులై 10న జన్మించారు. ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001-2003 మధ్య వరంగల్‌ రేంజి డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు హోంగార్డు విభాగం డీఐజీగానూ సేవలందించారు. 2003-2004 వరకూ ఎస్‌ఐబీ డీఐజీగా, 2004-2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా పనిచేసిన సవాంగ్‌ ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు.

ap police 26052019

2005-2008 వరకూ సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008-2009 మధ్య శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై మూడేళ్ల పాటు లైబీరియాలో ఐక్యరాజ్యసమితి పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఏపీ పోలీసు పటాలం అదనపు డీజీగా పనిచేశారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసి తనదైన ముద్రవేసిన సవాంగ్‌... గతేడాది జులై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ఈ నెల 30న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుశాఖపరంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ap police 26052019

విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించి అధికారులతో సమీక్షించారు. గతేడాది జులై 1న ఆర్‌.పి.ఠాకూర్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 11 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సవాంగ్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఠాకూర్‌.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు వెళ్లారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read