ఎన్నికల ముందు వరకూ జగన్ మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లో చెప్పిన మాట, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకుని వస్తాను, 25 ఎంపీ సీట్లు నాకు ఇవ్వండి, నేను ఢిల్లీలో అందరి మెడలు వంచేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. విభజన హామీలు, నిధులు, స్పెషల్ స్టేటస్, ఇలా అన్నీ మెడలు వంచి తెచ్చేస్తాను అని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. నిజంగానే జగన్ మెడలు వంచి తెస్తారేమో, నిజంగానే మనకు ఉద్యోగాలు, జిల్లాకో హైదరాబాద్ అవుతుంది ఏమో అని ప్రజలు అనుకుని, జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. అయితే తన అవసరం తీరగానే, జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాలు చూసుకోవటం మొదలు పెట్టారు. మెడలు వంచటం తరువాత, మోడీ కనిపిస్తే ఆయన కాళ్ళ మీద పడిపోవటం దగ్గర నుంచి మొదలైంది జగన్ మోహన్ రెడ్డి, మెడలు వంచే ప్రయాణం. ఇక్కడితో అయిపోలేదు, మెడలు ఎప్పుడు వంచుతున్నారు అని అడిగితే, ఏంటి వంచేది, ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప, మనం పీకేది ఏమి లేదని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అడుగుతూనే, అడుక్కుంటూనే ఉండాలి అని ఆయన చెప్పారు. దీనికి ప్రధాన కారణం, నరేంద్ర మోడికి, కేంద్రంలో బలం ఉందని, ఆయనకు మన సపోర్ట్ అవసరం లేదని, మన సపోర్ట్ అవసరం అయితే, మెడలు వంచే వాడిని అని చెప్పారు.
అయితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు జగన్ మోహన్ రెడ్డి అవసరం, మోడీకి లేదేమో కానీ, ఇప్పుడు నరేంద్ర మోడీకి, జగన్ మోహన్ రెడ్డి అవసరం వచ్చి పడింది. ఒక విధంగా చెప్పాలి అంటే, ఇది జగన్ మోహన్ రెడ్డికి ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. అదే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక. కేంద్రంలో బీజేపీ అంత బలంగా ఉన్నా, రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం, బీజేపీ బలం సరిపోవటం లేదు. రాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 10,98,903 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఎంపీకి ఓటు విలువ ఉంటుంది. బీజేపీకి దాని మిత్రపక్షాలు కలిపి, 5,37,126 ఓట్లు అవుతాయి. అయినా కూడా 9,194 ఓట్లు తక్కువ అవుతాయి. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేడీ, జగన్ పార్టీ మాత్రమే, ఇవి భర్తీ చేయగలదు. టీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి ఓటు వేయదు. దీంతో, ఇప్పుడు జగన్ ఒక్కడే మోడీకి కీలకం అవుతారు. మరి ఇంత కీలకమైన జగన్, మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే, మీకు ఓటు వేస్తాను అని చెప్పే దమ్ము ఉందా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం, జగన్ మోహన్ రెడ్డి ఇంత సాహసం చేయగలరా ? జగన్ కు ఇంతకంటే మంచి చాన్స్ ఉండదు, మరి ఏమి చేస్తారో చూడాలి మరి.