ఎక్కడైనా ఒక పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారతన్నాడు అంటే, ఆ వ్యక్తిని పార్టీ మారకుండా బుజ్జగిస్తాయి పార్టీలు. ఆయనకు ఏమి కావాలో అది చేసి, బుజ్జగిస్తూ ఉంటాయి. అందునా ఒక మాజీ మంత్రి, దళిత వర్గం అయితే, అలాంటి వ్యక్తిని వదులుకోవటానికి ఏ పార్టీ సాహసించదు. అందులోనూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, అంత తేలికగా ఎవరినీ వదులుకోరు. అయితే, ఇక్కడ మాత్రం అంతా రివర్స్, పార్టీ మారతన్నాడు అనే వార్తలు రాగానే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మేళతాలాలతో సాగానపుతాం అంటున్నాయి. వార్తా ఛానల్స్ లో తెలుగుదేశం పార్టీకి షాక్, చంద్రబాబుకి షాక్ అని రాస్తున్నాయిని, అసలు మాకు షాకే లేదని, ఆయన్ను హాయగా పార్టీ నుంచి సాగానంపుతాం అంటున్నాయి. ఇంతకీ ఆ ఎమ్మల్యే, మాజీ మంత్రి ఎవరంటే, రావెల కిషోర్‌బాబు.
మాజీ మంత్రి, పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు త్వరలోనే టీడీపీకి రాజీనామా చేయనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 1న విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో రావెల పార్టీలో చేరనున్నారు. కాగా ఇప్పటికే జనసేనలో చేరికపై పవన్ కల్యాణ్‌తో రెండు దఫాలుగా రావెల భేటీ అయ్యారు. కొంత కాలంగా రావెల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ తనను పట్టించుకోవట్లేదని రావెల అసంతృప్తితో ఉన్నారు. గత కొన్ని రోజులుగా రావెల పార్టీ మారతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన రావెల కిషోర్‌కు ఏపీ కేబినెట్‌లో చంద్రబాబు చోటు కల్పించారు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాల వల్ల రావెలను మంత్రి పదవి నుంచి తప్పించడం జరిగింది.
వివాదాస్పద వ్యక్తిగా పేరున్న రావెల కిషోర్‌బాబును జనసేనలోకి చేర్చుకునేందుకు పవన్ ఎలా ఓకేచేశారని జనసేన శ్రేణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడు ఇతని పై పోరాడామని, ఇప్పుడుం మన పార్టీలో చేరిపోగానే, పునీతుడు అయిపోతాడా అని జనసైనిక్స్ అంటున్నారు. రాజధాని భూ అక్రమాలల్లో రావెల పాత్రతో పాటు, ఆయన కుమారులపైనా పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లో రావెల కుమారుడు ఒక ముస్లిం మహిళను రోడ్డుపైనే చేయి పట్టుకుని కారులోకి లాగబోయాడు. ఆ సమయంలో స్థానికులు అతడిని చితక్కొట్టారు. కానీ తర్వాత కేసు రాజీ చేసుకున్నారు. మరో సందర్భంలో రావెల కిషోర్‌బాబు కుమారుడు మద్యం సేవించి అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. రావెల కిషోర్‌బాబు పైనా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. రావెల కిషోర్‌బాబు తనను వేధిస్తున్నాడంటూ గుంటూరు చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ అప్పట్లో బోరున విలపించారు. ఈ వ్యవహారశైలి వల్లే రావెల మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నారు. అయితే వైసీపీలోకి వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యగా, అక్కడ తలుపులు వేసేయ్యటంతో, పవన్ చేర్చుకోవటానికి రెడీ అయ్యారు.