కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ మంగళవారం సైబర్‌క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సొంత ప్రయోజనం కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారంటూ టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా రవిప్రకాష్‌కు పలుమార్లు నోటీసులు జారీచేశారు. రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరుకాకపోగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ కోరుతూ రవిప్రకాష్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు.
అక్కడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. రవి ప్రకాష్ పోలీసు విచారణకు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. దీంతో రవిప్రకాష్ నేడు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 41ఏ సీఆర్పీసీ కింద విచారణకు హాజరు కావాలని ఇది వరకే ఆయనకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీచేసినా రవిప్రకాశ్ హాజరుకాలేదు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఉపశమనం లభించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడా ఆయనకు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్థానం కూడా తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ విషయాన్ని హైకోర్టే తేల్చాల్సి ఉందని.. అక్కడికే వెళ్లాలని సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. 41(ఏ) నోటీసు కింద పోలీసుల ఎదుట విచారణకు తప్పకుండా హాజరు కావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు టీవీ9కు సంబంధించిన పత్రాలను ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా ఫిర్యాదుతో రవిప్రకాశ్‌పై వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. ఆయనతో పాటు సినీనటుడు శివాజీ, మూర్తిపైనా కేసులు నమోదు కాగా.. మూర్తిని మాత్రమే పోలీసులు పలు దఫాలుగా విచారించారు. శివాజీ, రవిప్రకాశ్ విచారణకు హాజరుకాలేదు. సుప్రీంకోర్టు సైతం రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టుకే వెళ్లాలని స్పష్టంచేసిన నేపథ్యంలో తమ ఎదుట హాజరైన రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు పలు ప్రశ్నలు సంధించనున్నారు. అలంద మీడియా ఫిర్యాదుతో పోలీసులు టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్, శివాజీ, మూర్తి ఇళ్లల్లోనూ సోదాలు చేశారు.