ఆమె వయసు 80 ఏళ్లు. కానీ ఎంతో ఉత్సాహంగా ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ తిరుగుతూ ‘‘అమ్మా.. నా బిడ్డను ఆశీర్వదించండి, ఇప్పటికే మూడుసార్లు ఓడిపోయాడు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇక ఎన్నాళ్లు బతుకుతానో తెలీదు. చివరగా నా బిడ్డను ఎమ్మెల్యేగా చూడాలనుంది..’’ అంటూ ఆమె చేస్తున్న అభ్యర్థన ఆ నియోజకవర్గ ప్రజలను కదిలిస్తోంది. పలకరింపులో అభ్యర్థన, పిలుపులో ఆత్మీయతతో అందరినీ కట్టిపడేస్తున్న ఆమె మాజీమంత్రి రెడ్డప్పగారి రాజగోపాల్‌రెడ్డి సతీమణి హైమావతమ్మ. తన కుమారుడు, రాయచోటి టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం ఆమె చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది.
పదకొండే ఏట నుంచే రాజకీయాలు.. నేను రాజకీయాలను చిన్నప్పటి నుంచి అంటే 11వ ఏట నుంచే చూస్తున్నాను. మా నాయన వేంపల్లె ప్రెసిడెంటుగా నామినేషన్‌పై ఎన్నో ఏళ్లు పనిచేశారు. అయ్య నామినేషన్ ఎప్పుడు ఏస్తారా అని ఎదురు చూసేదాన్ని. మా నాయనకు టికెట్ వచ్చినప్పుడల్లా బసిరెడ్డి, వైఎస్ రాజారెడ్డి, కడప కోటిరెడ్డి వీళ్లంతా.. మా నాన్న దగ్గరకు వచ్చి నాగిరెడ్డీ.. ఈసారి మేముంటామప్పా మాకివ్వండి అని వాళ్లిప్పిచ్చుకుని పోయేవారు. అప్పటి నుంచే నాకు రాజకీయాలపై ఒక ఆలోచన ఉండేది. పెళ్లి అయి మెట్టినింటికి వచ్చాక మా పెనిమిటి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టు పనులు చేసేవారు. 1962లో రాజకీయాల్లోకి దిగి లక్కిరెడ్డిపల్లె నుంచి విశ్వనాధరెడ్డిపై పోటీ చేశారు. 350 ఓట్ల తేడాతో మా ఆయన ఓడిపోయారు. తొలిసారి ఓటమితోనే రాజకీయాల్లో ఎన్నో నేర్చుకున్న ఆయన ఆ తరువాత ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో, ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లో మంత్రి సతీమణిగా ఇంటి నుంచి బయటికి వచ్చేదాన్ని కాదు. ఆ రాజకీయాలు, ఆ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. మీటింగులకు కానీ, ఆయనతో పాటు కానీ తిరిగేదాన్ని కాదు. నేను ఇంటిని, పిల్లల సంరక్షణ చూసుకునేదాన్ని.
కొడుకుకోసం ఎండలో తిరుగుతున్నా... మా ఆయన మొదటి ఎన్నికల్లో రూ.30వేలే ఖర్చు పెట్టారు. ఈ రోజు ఎన్నికల్లో ఎంత ఖర్చవుతుందో మనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ మూడుసార్లు రమేష్ ఓడిపోయారు. నాకా వయసు పైబడుతోంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో రమేష్ గెలిచి ఎమ్మెల్యే అయితే చూడాలన్నది నా కోరిక. నేను ఏమీ ఇచ్చుకోలేనయ్యా.. నమస్కారం పెట్టి ఇంటింటికీ వెళ్లి నా బిడ్డను ఆశీర్వదించండి అని కోరుతున్నా. 80 ఏళ్ల వయసులో ఎండలో తిరుగుతూ ఇలా ప్రచారం చేయడం ఇబ్బంది అనుకుంటే ఎలా? బిడ్డ గెలుపు ముందు ఇవేమీ కష్టం కాదు. ఓటర్లకు నేను చెప్పేది ఒకటే. ఈ సారి నా బిడ్డను ఆశీర్వదించండి. తప్పకుండా ఓటేయండి.. మమ్మల్ని గెలిపించండి అని అడుతున్నా. ఏ ఇంటి గడప తొక్కినా అందరూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇక నా బిడ్డ గెలుస్తాడని నమ్మకం ఉంది. నియోజకవర్గ ప్రజలు కూడా ఈ సారి రమేష్‌ను గెలిపించాలని కోరుతున్నారు. గెలుపునే చూస్తున్నాను కానీ ఎండా, వాన కాదు నాకు. తప్పకుండా బిడ్డ గెలిచి ఎమ్మెల్యే అయితే చాలు.. అని ముగించారు..