ఆంధ్రప్రదేశ్ ని, ది సన్ రైజ్ స్టేట్ అని ఏమంటా పిలుస్తున్నారో కాని, ఇప్పుడు మాత్రం, నిజంగానే సన్ రైజ్... రాష్ట్రంలో మండే ఎండల నుంచి విలువైన వేల కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమ జిల్లాలు వేదికల వుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన మెగా సోలార్ పార్క్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి ఊపందుకోగా అనంతపురం, కడప జిల్లాలకు సంబంధించిన మరో నాలుగు సోలార్ పార్క్‌ల ప్రగతి వివిధ దశల్లో ముందుకు సాగుతోంది. ఈ మూడు జిల్లాలకు చెందిన 5 సోలార్ పార్కుల ద్వారా సమీప భవిష్యత్తులో 4 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు అందుబాటులోకి రానున్నది... విద్యుత్ అవసరాల కోసం చేస్తున్న ఉత్పత్తి వల్ల ఏర్పడుతున్న జల, బొగ్గు, ఇంధనాల కొరత, సంబంధిత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థల వల్ల పెరుగుతున్న వాతావరణపరమైన కాలుష్యాల గురించి సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో వుంచుకుని ప్రత్యామ్నాయ సాంప్రదాయేతర ఇందన వనరులపై చంద్రబాబు దృష్టిని సారించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ దాదాపు 40 జిగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశాలున్నాయని, అందులో 60 శాతం రాయలసీమ జిల్లాల్లోనే ఉత్పత్తి చేయవచ్చునని సూచించింది. ఆ సూచన మేరకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ జెన్‌కో, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీల సంయుక్త భాగ స్వామ్య వేదికగా ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిని సారించింది. ఈ క్రమంలో ప్రపంచం లోనే ఒక స్థలంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి వ్యవస్థగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఆవిర్భావం జరిగింది. ఆ పార్క్ ఏర్పాటుకు ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో జరిగిన టెండర్ల ప్రక్రియలో మొత్తం వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో 500 మెగావాట్లకు గ్రీన్‌కో, 350 మెగావాట్లకు సాఫ్ట్ బ్యాంక్ ఎనర్జీ, వంద మెగావాట్లకు అజ్యూర్ పవర్, 50 మెగావాట్లకు అదాని పవర్ సంస్థలు ఎంపికయ్యాయి. ఆపార్క్ ద్వారా అంచెలంచెలుగా మొదలైన సౌరవిద్యుత్ ప్రస్తుతం 750 మెగావాట్లకు చేరుకుంది.
ఈ అనుభవంతో అనంతపురం జిల్లా ఎస్‌పి కుంటవద్ద జెన్‌కో ద్వారా 1500 మెగావాట్లు, కడప జిల్లాలో మైలవరం వద్ద వెయ్యి మెగావాట్లు, గాలివీడు వద్ద 500 మెగావాట్లు చొప్పున 3 వేల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే వ్యవస్థల స్థాపన మొదలైంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ఆయా వ్యవస్థలను దక్కించుకున్న వివిధ ప్రైవేటు సంస్థలు ఉత్పాదనలో తలమునకలవుతున్నాయి. వీటిలో ఎన్‌పీ కుంట, మైలవరం వ్యవస్థల ద్వారా దాదాపు 800 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి మొదలైందని తెలుస్తోంది. యూనిట్‌కు రూ. 3.72 పైసలు చొప్పున చెల్లిస్తూ ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో ఆయా సంస్థలు కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 2,022 నాటికి పూర్తి స్థాయిలో 4 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యం కాగా, మరో ఏడాది లోనే లక్ష్యాన్ని సాధించే అవకాశాలున్నాయని సంబంధిత అధికారవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ప్రాజెక్టులకు వ్యవసాయం చేయడానికి ఉపయోగపడదని తేలిన 20 వేల ఎకరాల స్థలాలను కేటాయించిన ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతి సౌకర్యాలన్నీ ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా కల్పిస్తోంది. ఇవికాక రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా 10 మెగావాట్ల నుంచి 25 మెగావాట్ల వరకు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే చిన్న చిన్న వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి పలు ప్రైవేటు సంస్థలు ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరుమల క్షేత్రంలో సౌరవిద్యుత్ వినియోగాన్ని పెంచిన టీటీడీ కూడా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలోని తమకు చెందిన స్థలంలో ప్రైవేటు సంస్థ ఒప్పందంతో నెలకొల్పిన సౌరవిద్యుత్ యూనిట్ ద్వారా 10 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, గ్రిడ్‌కు అందజేస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో అంచెలంచెలుగా పెరుగుతూ ఉన్న సౌరవిద్యుత్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని పరిశీలించినప్పుడు సమీప భవిష్యత్తులో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సౌరవిద్యుత్‌లో సింహభాగం రాయలసీమ జిల్లాల నుంచే ఉంటుందని స్పష్టమవుతోంది.