రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయనున్నారా? గత కొద్ది రోజులుగా కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకోనున్నారని తెలుస్తోంది. పటేల్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పందించడానికి అటు ఆర్బీఐ, ఇటు ఆర్థిక శాఖ నిరాకరించాయి. ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర విషయాల్లో ప్రభుత్వ సూచనలకు రిజర్వ్ బ్యాంక్ ససేమీరా అంటుండటంతో.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఉర్జిత్ పటేల్‌కు ప్రభుత్వం లేఖలు పంపింది. ప్రజా ప్రయోజనం కోసం, నిర్దిష్ట సమస్యల విషయంలో రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతూ ఆర్బీఐ గవర్నర్‌కు సూచనలు చేసే అధికారం కేంద్రానికి ఉందని సెక్షన్ 7 స్పష్టం చేస్తోంది.
స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకూ సెక్షన్ 7ను కేంద్రం వాడలేదు. 2008 సంక్షోభం సమయంలోనూ, 1991లో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా కేంద్రం ఇలా చేయలేదు. అసాధారణ రీతిలో కేంద్రం సెక్షన్ 7ను ఉపయోగించడంతో.. ప్రభుత్వ ఉద్దేశాలు, ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు శుక్రవారం ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోన్న తరుణంలో పటేల్ తన పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. రిజర్వుబ్యాంకును ఈ ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వకుండా, తన అవసరాలను, విధానాలను దాని మీద రుద్దుతూ పీకనులుముతున్నదని బ్యాంకు ఉద్యోగుల సంఘం విరాళ్ ఆచార్య విరుచుకుపడ్డారు.
రిజర్వుబ్యాంకు బోర్డులో పరివార్ మనిషి గురుమూర్తిని పార్ట్‌టైమ్ డైరక్టర్‌గా నియమించడంతో నిప్పురాజుకుంది. మోదీ మనిషిగా గురుమూర్తి అతిజోక్యం బ్యాంకులో అందరినీ బాధిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా రెండోసారి గవర్నర్ గిరీ వెలగబెట్టకూడదని ఉర్జీత్ సైతం అనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో నిబంధనలను బాగా సడలించి చిన్నతరహా పరిశ్రమలకు భూరిగా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్టు, అలాగే, సుమారు యాభై బిలియన్ డాలర్ల మిగులు నిధుల బదిలీ విషయంలోనూ స్పర్థలు నెలకొన్నట్టు చెబుతున్నారు. రిజర్వుబ్యాంకుతో సంబంధం లేకుండా అర్థరాత్రి మోదీ ఏకపక్షంగా తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయం వేలాది చిన్నపరిశ్రమలను దెబ్బకొట్టి, లక్షలాదిమంది ఉపాధిని మాయం చేసిన విషయం తెలిసిందే.