దేశంలో నల్ల ధనం పెరిగిపోయింది కాంగ్రెస్ జమానా అవినీతి ఖజానా అని ఊదరగొట్టే ఎన్నికల్లో గెలిచిన మోడీ నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కి తెప్పించలేక, దేశంలో నల్లధనం గుట్టలు గుట్టలుగా పెరిగిపోయిందని చెప్పి పెద్ద నోట్ల రద్దు అనే ప్రహసనానికి తెరతీశారు. దేశంలో భారీగా నల్లధనం ఉంటది 3 లక్షల కోట్లు దాకా నల్లధనం వెనక్కి రాదు, మేము నల్లధనాన్ని దేశం నుంచి రూపుమాపాము అది చెప్పాలనుకున్నారు. తనకు తెలిసిన నాటకీయ ధోరనిలో ఒక రాత్రి హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేశారు మూడు నెలలు ప్రజలను రోడ్ల మీద నిలబెట్టి కష్టాల పాలు చేసారు, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారు.
అనేక లక్షల మంది ఉపాధి కోల్పోటానికి కారణం అయ్యారు. ఆ తర్వాత వంద రోజులు ఓపికపట్టండి అప్పటికి మంచి రోజులు రాకపోతే నన్ను తగలబెట్టండి అని మరో నాటకానికి తెరతీశారు. రెండేళ్ల గడిచిన తర్వాత రిజర్వు బ్యాంకు తీరికగా అసలు విషయం వెల్లడి చేసింది. బ్యాంకులకు తిరిగిరాని నల్లధనం కేవలం 10, 700 కోట్లు, కానీ రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెట్టడానికి రిజర్వ్ బ్యాంకు ఖర్చు చేసిన మొత్తం 7,800 కోట్లు. ఇది మన ఘనత వహించిన ప్రధాని, చేసిన అతి పెద్ద ఘనకార్యం. పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అని గణాంకాలు తేల్చాయి. ప్రధాని రద్దు చేసిన సొమ్ములో 99.3 శాతం తిరిగి తెల్లధనమై బ్యాంకులకు చేరింది. రద్దయిన మొత్తం రూ.15.41 లక్షల కోట్లలో కనీసం ఐదు లక్షల కోట్ల నల్లధనం తేలుతుందని మోదీ సర్కారు భావించగా, కేవలం రూ.10,727 కోట్లు మాత్రమే బ్యాంకులకు చేరలేదని ఆర్‌బీఐ తేల్చింది.
అంటే, కనీసం ఒక్క శాతం కూడా మిగల్లేదు. కొత్త నోట్ల ముద్రణకు అయిన రూ.21 వేల కోట్ల ఖర్చులన్నా పెద్ద నోట్ల రద్దులో మిగల్లేదు. ఇదికాక నోట్ల రద్దు తర్వాత ఏడాదిలో ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం రూ.2.25 లక్షల కోట్లని ఆర్థిక నిపుణులు తేల్చారు. నాడు మోదీ చెప్పిన పెద్ద నోట్ల రద్దు లక్ష్యాలు... సమాంతర ఆర్థిక వ్యవస్థను అరికట్టడం, నకిలీ నోట్లకు సమాధి కట్టడం, ఉగ్రవాదాన్ని అణచివేయడం... ఏవీ పూర్తిగా సాధించలేదు. ఆ విషయం గ్రహించే ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల లక్ష్యాన్ని కొత్తగా చేర్చి ప్రచారం చేసింది. మొదట్లో డిజిటల్ చెల్లింపులు పెరిగినా తర్వాత కాలంలో నగదు సరఫరా పెరగడంతో యథాస్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు ఈ గణాంకాలన్నీ బయటకు వస్తుండటంతో పెద్ద నోట్ల రద్దు విషయంలో మోదీ ఆత్మరక్షణలో పడ్డారు.