ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సాక్ష్యాత్తు అధికార పార్టీ ఎంపీలే డబ్బులు లేవు, జీతాలకు కూడా ఇవ్వలేక పోతున్నాం అంటూ, పార్లమెంట్ లోనే వాపోతున్నారు అంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏ నిమిషాన దివాళా అనే బ్రాండ్ అధికారికంగా ప్రకటిస్తారో అని ఆందోళన చెందుతున్న పరిస్థితిలో, రోజుకి ఒక అంశం తెర మీదకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించటం లేదని, వారం రోజుల క్రితం విద్యుత్ ఆపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇదే అంశం పై ఎన్.టి.పి.సీ మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్.టి.పి.సీకి, రూ.860 కోట్లు బాకీ ఉంది. అయితే ఎన్.టి.పి.సీ గత రెండు, మూడు నెలల నుంచి ఈ డబ్బులు చెల్లించాలని రాష్ట్రం వెంట పడుతూనే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు కానీ స్పందించకుండా లైట్ తీసుకున్నారు. దీంతో ఎన్.టి.పి.సీ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకుని వెళ్ళింది. కేంద్ర ఇంధన శాఖ అధికారులు కూడా రాష్ట్ర అధికారుల పై ఒత్తిడి తెచ్చారు. అయినా సరే, ఎక్కడా రాష్ట్రం నుంచి స్పందన లేకుండా పోయింది. దీంతో కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. ఆర్బిఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ఎకౌంటులను ఫ్రీజింగ్ చేయాలనియా, అంటే నిలిపివేయాలని, ఆర్బిఐకు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఆర్బిఐ కేంద్రం ఇచ్చిన ఆదేశాలు పాటించే క్రమంలోనే, విషయం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అధికారులకు తెలియటంతో, రంగంలోకి దిగారు. అలా చేస్తే విద్యుత్ కొనుగోళ్ళు ఆగిపోతాయని, మరింత ఇబ్బంది పడతామని, డబ్బులు ఎలాగోలా సర్దుబాటు చేస్తామని, ఎన్.టి.పి.సీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో వాళ్ళు మెత్తబడటంతో, సమస్య కొంత వరకు ప్రస్తుతానికి సర్దుబాటు అయ్యింది. అయితే రూ.860 కోట్ల సర్దుబాటు విషయంలో, రూ..360 కోట్లు బిల్ డిస్కౌంట్ కింద అడ్జెస్ట్ చేసుకోవాలని, మిగతా 500 కోట్లు ఈ నెల 20 లోపు ఎలాగోలా ఇచ్చేస్తామని ఎన్.టి.పి.సీ అధికారులకు, రాష్ట్ర అధికారులు నచ్చ చెప్పారు. ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, నేరుగా రంగంలోకి దిగి, అటు కేంద్రంతో, ఇటు ఎన్.టి.పి.సీ అధికారులతో, ఇటు ఆర్బిఐతో, ఇలా అందరిని బ్రతిమిలాడి, ఈ సారికి సర్దుబాటు చేసారు. అయితే ఈ పరిణామం చూస్తుంటే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాను రాను రాష్ట్రంలో, ఎలాంటి ఇబ్బందిక పరిస్థితి ఉంటుందో చూడాలి మరి.